ప్రస్తుత ప్రపంచంలో ప్రతి వస్తువు కల్తీమయంగా మారిన తరుణంలో వందేళ్లు బతకాలనుకోవడం అత్యాశే అవుతుంది. మనిషి వందేళ్లు జీవిస్తేనే అబ్బో అంటాం. కానీ ఓ బామ్మ మాత్రం ఏకంగా 121వ వసంతలోకి అడుగుపెట్టింది. ఆమె జన్మదిన వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన లచ్చవ్వ ఇప్పటికీ హుషారుగా మాట్లాడుతోంది.
పొట్లపల్లి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు జొన్నగడ్డల లచ్చవ్వ. ప్రస్తుతం ఆమె తన చిన్న కొడుకు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 121వ జన్మదిన వేడుకలను ఊరంతా ఏకమై ఘనంగా నిర్వహించారు. అందరినీ పేరుపేరున పలకరిస్తూ కుశలప్రశ్నలు వేస్తున్న లచ్చవ్వను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు.
అమ్మప్రేమకు ఏదీ సాటిరాదు:
డబ్బును ఎంతైనా సంపాదించవచ్చని.. కానీ అమ్మ ప్రేమను మాత్రం సంపాదించలేమని ఆమెకు సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన వరమని వృద్ధురాలి కుమారుడు లక్ష్మయ్య అన్నారు. తమ గ్రామంలో శతాధిక వృద్ధురాలైన లచ్చవ్వ జన్మదిన వేడుకలను పంచాయతీ ఆవరణలో నిర్వహించి ఆమెకు తగిన గౌరవం ఇచ్చామని గ్రామస్థుడు మోహన్ తెలిపారు. లచ్చవ్వ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.