సిద్ధిపేట జిల్లాలోని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంపైనే ఉంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడం వల్ల దుబ్బాక శాసనసభ స్థానం ఖాళీ అయింది. ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలి. తెరాస సిట్టింగ్ స్థానం కాగా, రాబోయే ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, భాజపా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా.. ఫలితం ఎలా ఉంటుందన్న దృష్టితో నియోజకవర్గ ప్రజలతో పాటు.. జిల్లా రాజకీయ పక్షాలు కూడా దుబ్బాక రాజకీయాలపై అసక్తి కనబరుస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన గడ్డగా దుబ్బాక నియోజకవర్గానికి పేరుంది. ఇక్కడ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టు 6న తుది శ్వాస విడిచారు. 2018, డిసెంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో రామలింగారెడ్డి తెరాస నుంచి నాలుగో పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 వరకు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నా ఆయన కన్నుమూయడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.
ఫిబ్రవరిలో ఎన్నికలు..?
సాధారణంగా ఖాళీ అయిన శాసనసభ స్థానాలకు ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా దుబ్బాకలో ఉపఎన్నిక జరపాలి. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దుబ్బాక నియోజకవర్గంలోనూ కొవిడ్ విస్తృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము వంటిదే. బిహార్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామనే సంకేతాన్ని పంపింది. నామపత్రాల దాఖలు, ప్రచారం, ఓటింగ్ వంటి ప్రక్రియలు చేపట్టడానికి నూతన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోనూ నిర్దేశిత వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
వ్యూహాత్మకంగా అడుగులు..
దుబ్బాక తెరాస సిట్టింగ్ స్థానం కావడం వల్ల ఉప ఎన్నికలోనూ ఆ సీటును తమ ఖాతాలోకే వస్తుందని తెరాస ఆలోచిస్తోంది. దివంగత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ వస్తుందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు ఉన్నాయి. ఈ మేరకు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లోనూ అంతర్గతంగా అదే వ్యక్తమవుతోంది. అయితే.. రామలింగారెడ్డి లేని లోటును పూడ్చడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇటీవల దౌల్తాబాద్, దుబ్బాకలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బరిలో కాంగ్రెస్, భాజపా..
మరోవైపు అధికార పార్టీలోనే కొందరు నేతలు టికెట్‌పై కన్నేశారు. పరిస్థితులు, అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి వ్యవహరించాలన్న వ్యూహంతో వారున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఉపపోరులో తమ పార్టీ బరిలో నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హస్తం నేతలు పలువురు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరో ప్రధాన రాజకీయ పక్షమైన భాజపా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో సదరు పార్టీకి చెందిన ఓ కీలక నేత ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. ఈ పార్టీకి చెందిన ఓ నాయకుడు మళ్లీ నియోజకవర్గంలో క్రియాశీలకంగా మారుతున్నారు. అయితే.. భాజపాలో సైతం దుబ్బాక సీటు కోసం ఇద్దరు నేతలు బరిలో నిలవడానికి పోటీపడుతున్నట్లు సమాచారం.
మొత్తంమీద ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా.. ముందు చూపుతో నేపలు పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు సమయమున్నా.. ప్రజల్లో పాపులారిటీ కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ