A Man Died While Playing Cricket: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో చెప్పడం చాలా కష్టం. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా.. అనారోగ్యంగా ఉన్నాడా అనే తేడా లేకుండా హఠాత్తుగా మరణిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, విభిన్న శైలిల కారణంగా మనిషి 60 సంవత్సరాల జీవితాన్ని బతకడం కూడా కష్టంగా మారుతోంది. ఈ మధ్య చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువ మంది మరణానికి గుండెపోటు కారణమవుతోంది. కొవిడ్ తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే చాలా మంది వ్యాయామాలు, రన్నింగ్, వివిధ క్రీడలను హాబీలుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆటలు ఆడుతూ.. మరికొందరు జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతున్నారు.
A Person Died While Playing Cricket: తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్లో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో గుండెపోటుతో శనిగరం ఆంజనేయులు(37) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడిని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. కుప్పకూలగానే యువకుడికి సీపీఆర్ చేసి చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. క్రికెట్ ఆడుతూ.. యువకుడు మృతి చెందడంతో సహచర మిత్రులు, క్రీడాకారులు విషాదంలో మునిగిపోయారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న యువకుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగరానికి చెందిన పరమేశ్ యాదవ్ అనే యువకుడు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ఆ నొప్పిని భరించలేక ప్రాణాలను వదిలాడు. అక్కడే ఉన్న వాళ్లు అతనిని గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరమేష్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయమం చేస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడ ఉన్న వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆతడు గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఇవీ చదవండి: