ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఆ మోజులో పడి ఒక్కోసారి అన్యాయంగా ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వారినీ వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేందుకూ వెనకాడటం లేదు. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధి పాలు చేస్తున్న ఘటనలు అనేకం. తాజాగా పెళ్లయి.. పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఓ విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసింది.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కుటుంబానికి భారం కాకూడదని ఓ షాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఓ వివాహితతో పరిచం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండటం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఇందులో భాగంగానే అతను సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. అక్కడే ఓ వివాహితతో పరిచయమైంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉండటం అభిషేక్ గమనించాడు. ఇది సహించలేక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చేశాడు.
ఈ నెల 17న పొలం వద్ద ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాధితుడు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. చేతికంది వచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
![మృతుడు అభిషేక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18069920_rop.jpg)
పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సరూర్‌నగర్ సీఐ జానకిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన సురేశ్‌కు.. అతని భార్య మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో అతను భార్య, పిల్లలు దూరమయ్యారని మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే అతను కొత్తపేట కూడలి వద్దకు చేరుకుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేశ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని సీఐ జానకిరెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: 15 నెలల చిన్నారి అనుమానస్పదంగా మృతి.. నానమ్మే చంపిందా?
ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పైలట్, చిన్నారికి తీవ్ర గాయాలు.. లైవ్ వీడియో..