గూడులేక అల్లాడిపోయిన అక్కాతమ్ముడు శ్రీలత, ప్రశాంత్ కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. అమ్మానాన్నలను కోల్పోయి రేకుల షెడ్డులో దయనీయ పరిస్థితిలో ఉన్న వారి పరిస్థితిని ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. ఇది చూసి చలించిపోయిన దాతలు ముందుకొచ్చారు. వారి ఇంటి కోసం సాయం చేశారు. అంతా కదిలి వారికి ఓ గూడు కల్పించారు. ఆదివారం నాడు ఆ అక్కాతమ్ముడు కొత్తింట్లో అడుగుపెట్టారు.
రేకుల షెడ్డులో...
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీలత, ప్రశాంత్‌లు అమ్మానాన్నను కోల్పోయారు. ఐదేళ్ల క్రితం తండ్రి, రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్నుమూసింది. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో వీరి జీవితం ఒక్కసారిగా అంధకారమయమైంది. రేకుల షెడ్డులో నివసిస్తూ కాలం వెల్లదీశారు.
మూడు ముళ్లకు దూరం
శ్రీలతకు పెళ్లి చేయాలని బంధువులు ప్రయత్నించారు. తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తమ్ముడు ఇబ్బందులు పాలవుతాడని ఆందోళన చెందారు శ్రీలత. వారు నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. కుట్టు మిషన్ పని చేస్తూ శ్రీలత తమ్ముడిని చదివిస్తున్న విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. 'తమ్ముడు ఆగమవుతాడని మూడు ముళ్లకూ దూరం' శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
కొత్తింట్లోకి..
వీరి దుస్థితిని చూసి చలించిపోయి చాలామంది దాతలు ముందుకొచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక దాత తొలుత రూ.50 వేలు వారికి అందించారు. అలా ఒక్కొక్కరుగా సుమారు 40 మంది వరకు స్పందించారు. రూ.500 ఇచ్చిన వారూ ఉన్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఒకరు రంగులు వేయిస్తే.. మరొకరు ఇసుక ఇప్పించారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయగా నిర్మాణం పూర్తవడంతో తమ్ముడు ప్రశాంత్, అక్క శ్రీలత కలిసి దాతల సమక్షంలో ఆదివారం తమ కొత్తింట్లోకి అడుగుపెట్టారు. ఒక హాలు, వంటగది, బెడ్‌రూం ఉన్న ఈ ఇంటిని చూసి వారు మురిసిపోతున్నారు.
ఇల్లు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. రేకుల షెడ్డులో కాలం వెల్లదీశాం. ఆ చిన్న షెడ్డులోకి ఒక్కోసారి పాములు వచ్చేవి. మా సమస్యలు వార్తల్లో వచ్చాయి. వాటిపై చాలామంది స్పందించారు. నలభై మంది వరకు మాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అంతా కలిసి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేశారు. చివరకు మా ఇల్లు పూర్తయింది. అమ్మానాన్నలను కోల్పోయిన మాకు సమాజంలోని ఇంతమంది మద్దతు దొరకడం అదృష్టం. దాతలందరికీ మేం రుణపడి ఉంటాం.
-శ్రీలత
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చొరవ
వీరి దుస్థితిని తెలుసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నందా మర్రి ఇంటి నిర్మాణం పూర్తికావడంలో కీలకంగా వ్యవహరించారు. నిర్మాణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు పూర్తి సహకారం అందించారు. రూ.1.50 లక్షల వరకు వెచ్చించడం గమనార్హం. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఈనాడు-ఈటీవీ భారత్‌లో కథనాన్ని చూసి చలించిపోయానని, అందుకే అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనికి తోడు పలువురు దాతలూ స్పందించడంతో శ్రీలత సొంతింటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
దాతల సాయం
సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ తరఫున రూ.15 వేలు అందించారు. నూతన వస్త్రాలను ఇచ్చారు. తెరాస రాష్ట్ర నాయకులు మఠం భిక్షపతి తన వంతుగా రూ.15 వేలు ఇచ్చారు. విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘు అరికెపూడి వంట పాత్రలు కొనిచ్చారు. శ్రీలత, ప్రశాంత్‌లతో పాటు వారి సమీప బంధువులకు కొత్త దుస్తులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లక్ష్మీదేవి పలుమార్లు ఆర్థిక సాయం అందించారు.
ఈ గృహప్రవేశానికి జిల్లా జైలు పర్యవేక్షకులు నవాబ్ శివకుమార్‌గౌడ్, నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణకుమార్, జోగిపేట ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ శంకర్‌బాబు, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ చక్రపాణి, అందోలు జడ్పీటీసీ సభ్యుడు రమేశ్, స్థానిక సర్పంచ్ కృష్ణ, తులసీరామ్, బంగారు కృష్ణ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన: శ్రీలత దీనగాథపై స్పందించిన దాతలు