లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను తగ్గించాయి. ఆయా డెయిరీలకు పాలు పోసే వారికి ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీనే ప్రత్యామ్నాయమైంది. ఫిబ్రవరిలో పాల సేకరణ పెంపు లక్ష్యంగా క్షేత్రబాట పట్టిన తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) అధికారులకు అంతంతమాత్రంగానే స్పందన వచ్చింది. లాక్‌డౌన్‌తో ప్రైవేటు సంస్థలు చేతులెత్తేయడం వల్ల ఇప్పుడు రైతులందరూ ఈ డెయిరీ బాట పట్టారు. ఒక్కసారిగా పాల సేకరణ పెరిగింది. లాక్‌డౌన్ తర్వాతా ఇలాంటి పరిస్థితే ఉండాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.
ఈ ప్రాంతాల్లో...
జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, పుల్కల్‌లో పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో కొన్ని చిన్నతరహా శీతలీకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సేకరిస్తున్న పాలను శీతలీకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తోంది. ఇటీవల లీటరుకు రూ.2 చొప్పున పెంచింది.
![పాల సేకరణ వివరాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6739399_san-gen-1c.jpg)
పెరిగిన సేకరణ
జిల్లాలో గతేడాది ఏప్రిల్ నెల 5న విజయ డెయిరీ పాల సేకరణ 10,424 లీటర్లు ఉంది. ఈ ఏడాది అదే రోజున 11,343 లీటర్లకు చేరింది. అంటే గత సంవత్సరంతో పోల్చితే 919 లీటర్లు పెరిగింది. వాస్తవానికి లాక్‌డౌన్ ప్రకటించిన రెండు మూడు రోజుల వరకు సేకరణ 15వేల లీటర్లుగా ఉంది. ప్రైవేటు డెయిరీలు పాలు ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు నిరాకరించడం వల్ల... ఉత్పత్తిదారులందరూ విజయడెయిరీని ఆశ్రయించారు. ఒక్కసారిగా పాల సేకరణ పెరిగింది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే వీరు తిరిగి ప్రైవేటువైపు వెళ్లే అవకాశం ఉందని... అధికారులు ఓ షరతు పెట్టారు. ఏడాది పాటు విజయడెయిరీకే పాలుపోస్తామని బాండు రాసిస్తేనే ప్రస్తుతం పాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై కొంతమంది రైతులు ఆలోచనలో పడగా మిగతా వారు ముందుకు వస్తున్నారు.
![విజయ డెయిరీకి పాలు పోస్తామంటూ బాండ్ అందిస్తున్న రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6739399_san_1.jpg)
బాండు రాసివ్వడం తప్పనిసరి
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం... జిల్లాలో కొత్తగా విజయడెయిరీకి పాలు పోయాలనుకునే వారు ఏడాదిపాటు పోస్తామని బాండు రాసివ్వడం తప్పనిసరి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ప్రస్తుతం పాల సేకరణ పెరిగింది. ప్రైవేటు కంటే ప్రభుత్వం డెయిరీకి పాలుపోయడమే మేలని రైతులకు ఇప్పుడు అర్థమవుతోంది. ఉత్పత్తిదారులకు బిల్లుల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం.
-ఎం.శ్రీనివాస్, పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య డిప్యూటీ డైరెక్టర్
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక