Telangana Student Injured in America Gun Fire: అమెరికాలోని షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతిచెందగా, కొప్పాల సాయి చరణ్ అనే యువకుడు గాయాలపాలయ్యారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే తానా ఫౌండేషన్ ట్రస్టీ, షికాగోలో తానా బాధ్యతలు చూసే హేమ కానూరు బాధితులకు సంబంధించిన చికిత్స ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి పరిస్థితులపై భారత్‌లోని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
ఆయన కథనం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన దేవ్‌శిష్, సాయిచరణ్, లక్ష్మణ్‌లు 10 రోజుల కిందట ఉన్నత విద్య అభ్యసించేందుకు షికాగోకు వచ్చారు. అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ముగ్గురూ కలిసి ఉంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్‌కు అవసరమైన రూటర్ కొనుక్కొని తెచ్చుకునేందుకు ముగ్గురూ కలిసి సమీపంలోని వాల్‌మార్ట్ షాపింగ్ మాల్‌కు వెళ్తుండగా.. వారిని కొందరు నల్లజాతీయులు వెంబడించారు. ఒకరేమో పెద్దగన్, మరొకరు చిన్న గన్ పట్టుకుని.. ఫోన్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో తెలుగు విద్యార్థులు వారి మొబైల్ ఫోన్లు కింద పెట్టేశారు. వాటిని అన్‌లాక్ చేయటానికి పిన్ వివరాలు అడగ్గా అవీ ఇచ్చారు. తర్వాత వారి వద్దనున్న డబ్బులూ ఇచ్చేశారు.
విద్యార్థుల నుంచి మొత్తం దోచుకున్న దుండగులు... వెళ్తూ వెళ్తూ వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దేవ్‌శిష్ ఛాతీలో కుడివైపు బుల్లెట్లు దూసుకెళ్లటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సాయిచరణ్‌కు ఊపిరితిత్తుల్లో గాయాలయ్యాయి. లక్ష్మణ్ మాత్రం తప్పించుకోగలిగారు. అయితే అప్పటికే కొంత స్పృహలో ఉన్న బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని అంబులెన్స్‌ల్లో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. దేవ్‌శిష్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయిచరణ్‌కు శస్త్రచికిత్స నిర్వహించగా.. ఆయన ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు.
ఆందోళనలో సాయిచరణ్ తల్లిదండ్రులు: హైదరాబాద్ పరిధిలోని భారతీనగర్ డివిజన్ పరిధి ఎల్‌ఐజీ కాలనీకి చెందిన కొప్పల శ్రీనివాసరావు, కేవీఎం లక్ష్మి దంపతుల కుమారుడు సాయిచరణ్. కాల్పుల విషయం తెలియగానే ఆయన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇవీ చదవండి: