తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను స్వాగతిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి నష్టం జరగకుండా, నాయకులు ఎవరూ బయటకు పోకుండా నిర్ణయం ఉండాలని మాత్రమే తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంక్షిప్త సమాచారం ద్వారా తన ఆవేదనను తెలియజేశారు. ఆమెకు నివేదించిన జాబితాలో తన పేరు లేకపోవడం, అధిష్ఠానం వద్ద చర్చకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు. ఆ సభకు తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మానిక్కం ఠాగూర్ వీటి గురించి తెలుసుకోకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు.
ఇదీ చదవండి: కృష్ణానదిపై బ్యారేజీ కోసం పాదయాత్ర : అద్దంకి దయాకర్