కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎప్పుడు భయపడదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఓడినా... నైతికంగా గెలిచినట్లేనని స్పష్టం చేశారు. ఓట్లన్నీ మతప్రాతిపదికన చీలిపోయాయని పేర్కొన్న జగ్గారెడ్డి... సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో తెరాసకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఆరోపించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు భాజపాను ఆదరించారని వివరించారు. ఇప్పుడు గెలుపొందిన 3 పార్టీలు కూడా పౌర సమస్యలను ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.
భాజపా ప్రతి ఎన్నికకు ఏదో ఒక దేవుడిని సాకుగా చూపిస్తోందని... ఇప్పుడు గెలిచిన 48 సీట్లు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారితో గెలిచినవేనని ఎద్దేవా చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా మారి 60 నుంచి 70 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడానికి పనిచేస్తామని వివరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విలువ పార్టీ నేతలకు ఇప్పుడు తెలియకపోయినా... భవిష్యత్‌లో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఓటమికి ఉత్తమ్ ఒక్కరే బాధ్యుడు కాదని... పీసీసీలో ఉండే ప్రతి నాయకుడిదని జగ్గారెడ్డి వెల్లడించారు.