రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో నిర్వహించిన ఐఎన్డీఎఫ్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగానున్న 41 ఆయుధ కర్మాగారాల ప్రతినిధులు పాల్గొన్నారు. మోదీ, అమిత్ షాలు.. అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకే రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారని రేవంత్ ఆరోపించారు. ఈనెల 27న దిల్లీలో జరిగే డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలో ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తించిన భాజపా నాయకులు.. నెహ్రు చేసిన సేవలను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో రక్షణ రంగ ఉద్యోగుల గొంతుకగా మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి;'ఎక్కువ మార్కులొచ్చినా.... ఉద్యోగం రాలేదు'