అన్ని వ్యయ ప్రయాసలకోర్చి పంట పండించడం ఒక ఎత్తయితే దాన్ని కాపాడుకోవడం రైతులకు మరో ఎత్తుగా మారింది. వరి కోత సమయం వచ్చినా తాడిపత్రిలు, సంచులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రైతులు.
పంట నూర్పిడి సమయంలో వర్షం వస్తే...
పటాన్చెరు నియోజకవర్గంలో వరి పంట కోత దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో రైతులు పంటను కోయనున్నారు. అయితే రైతులకు వరి పంట నూర్పిడి సమయంలో వర్షం వస్తే ఇబ్బంది పడకుండా గతంలో వ్యవసాయ అధికారులు సబ్సిడీపై రైతులకు తాడిపత్రిలు ఇచ్చేవారు. ఈ ఏడాది అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంట నూర్పిడి అనంతరం ధాన్యం వర్షం బారినపడకుండా చూసుకునేందుకు తాడిపత్రి ఉంటే ఉపయోగంగా ఉండేదని రైతులు వాపోతున్నారు.
ఎకరాకు ఏడున్నర వేల నష్టం...
గతంలో మెదక్ జిల్లాలో ముందుగానే రైతులకు ధాన్యం సంచులు అందజేసేవారు. పంట నూర్పిడి ప్రదేశం నుంచి సొసైటీకి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు ఈ సంచులు ఉపయోగపడేవి. ప్రస్తుతం సంచులు లేకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు నూర్పిడి ప్రదేశం నుంచే బరువును లెక్కిస్తూ తక్కువ ధరకు కట్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనివల్ల దాదాపు ఎకరాకు రూ.7,500 నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లామని రైతులు చెబుతున్నారు.
మేం నిబంధనలు పాటిస్తున్నాం...
రైతులకు సంచులు ఇచ్చే విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. సొసైటీకి ధాన్యం తెచ్చిన తరువాత తేమ పరిశీలించి అందజేస్తున్నామని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా నిబంధనలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇవీ చూడండి: మక్కలను మద్దతు ధరకు కొనాలంటూ రైతుల ఆందోళన