'జీవ వైవిధ్యమే దేవాలయం.. విత్తనాలే దేవుళ్లు'గా కొలిచే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం షంషేల్లపూర్లో జాతరలో భాగంగా.. బండ్ల ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రతినిధి డాక్టర్ ఆర్.పి. చంద్ర శేఖర, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ప్రతినిధి డాక్టర్ రుక్మిణి రావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి జాతరను ప్రారంభించి.. ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడం లక్ష్యంగా నెల రోజుల పాటు జరిగే ఈ జాతరను జిల్లాలో ఒక్కోరోజు ఒక్కో గ్రామంలో నిర్వహిస్తారు. ధాన్యాలను రైతులు తమ ఎడ్ల బండ్లకు అలంకరించారు. వంద రకాల ధాన్యాలతో ఊరేగింపు చేపట్టారు. ఆహారధాన్యాలను దేవుళ్లుగా కొలిచే ఈ విధానం పర్యటకులను ఆకర్షిస్తోంది.
ఆధునిక యుగంలో పాత పంటలను పూర్తిగా మర్చిపోతున్నాం. జహీరాబాద్లో ఈ రకమైన పంటలను పండించేందుకు డీడీఎస్ సంస్థ.. మహిళా రైతులను తయారుచేసి దేశానికి ఆదర్శంగా నిలిపింది. చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వీటిపై అందరూ దృష్టి సారించాలి.
డాక్టర్ ఆర్.పి. చంద్ర శేఖర, నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రతినిధి
ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లో బొమ్మల కొలువు.!