సూర్యాపేటలో చెరువు ఆక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్లతో కూడిన బెంచ్ సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలోని చెరువు ఆక్రమణపై విచారణ చేపట్టింది. కలెక్టర్ నేతృత్వంలోని నలుగురు అధికారుల కమిటీ సమర్పించిన నివేదికను ఎన్జీటీ తిరస్కరించింది. నివేదికను చెత్తబుట్టలో వేస్తామని తీవ్రంగా స్పందించింది.
ఆ విషయాన్నే ప్రస్తావించలేదు..
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుతోందా అని ప్రశ్నించింది. నివేదికలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం సమీపంలో చెరువు ఆక్రమణ జరిగిన విషయాన్ని ప్రస్తావించలేదని ఎన్జీటీ పేర్కొంది. చెరువు ఆక్రమణపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన విషయం నివేదికలో ప్రస్తావించకపోవడంపై మండిపడింది. మరోసారి తనిఖీలు జరిపి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
సాక్ష్యాలు సమర్పించినా...
సూర్యాపేట సమీపంలో ఒక చిన్న చెరువును కలెక్టర్ బృందం రెండుసార్లు తనిఖీలు జరిపి ఏమీ ఉల్లంఘనలు లేవని నివేదిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కర్నాలకుంట చెరువు ఆక్రమణపై ఇరిగేషన్ శాఖ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినా.. చెరువుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సంయుక్త కమిటీ నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్మార్జున్ దాఖలు చేసిన పిటిషన్లో నీళ్ల మధ్యలో నిర్మాణాలున్నట్లే కాకుండా చెరువు గట్టును డ్యామేజ్ చేసినట్లు ఫొటోలు సమర్పించినా.. ఏ నష్టం జరగలేదని కమిటీ పేర్కొందని వివరించారు.
మళ్లీ తనిఖీలు చేయండి..
పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఎన్జీటీ చెన్నై బెంచ్.. కమిటీ మళ్లీ తనిఖీలు జరిపి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. తనిఖీ ఎప్పుడు జరుగుతుందో పిటిషనర్ తరఫు న్యాయవాదికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: