Forest in farm land: రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రాణవాయువుని.. అందమైన ప్రకృతిని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరుకు చెందిన నారం శివరాజ్ (67). ఈ సంకల్ప సాధనకు తనవంతుగా మూడెకరాల్లో అడవినే సృష్టించారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి న్యాయవాద వృత్తి చేపట్టిన శివరాజ్.. 15 ఏళ్ల నుంచి ఈ క్రతువులో నిమగ్నమయ్యారు. గ్రామానికి సమీపంలో తనకున్న మూడెకరాల్లో 70 రకాల భిన్నమైన మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 3 వేల వరకు రకరకాల చెట్లు, మొక్కలున్నాయి.
టేకు, ఎర్రచందనం, మహాగని, అల్లనేరేడు, సీతాఫలం, మామిడి, చింత, జామ, సపోటా, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కలబంద, రణపాల, ఉసిరి తదితర చెట్లు పెంచుతున్నారు. చెట్లన్నీ ఏపుగా పెరిగి.. ఓ పిక్నిక్‌కు వచ్చిన అనుభూతి కలిగేలా ఆ అడవి ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంది. పండ్లు విరగకాయడంతో.. జీవరాశులకు కడుపునిండా ఆహారం లభిస్తోంది. వచ్చే ఫలాల్లో పక్షులు, జంతువులు తినగా మిగిలిన వాటినే తాము తీసుకుంటామని నారం శివరాజ్ చెబుతున్నారు. సమీపంలో మరో 3 ఎకరాల్లో ఇదే తరహాలో పూర్తిస్థాయిలో అడవిని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కలుషితం లేని ప్రాణవాయువును పీలుస్తూ.. విభిన్న రకాల చెట్లను తిలకిస్తూ.. చెట్ల మధ్యలో వాకింగ్ చేస్తూ.. మధ్యమధ్యలో పక్షుల కిలకిలరావాలు వింటూ.. ప్రతీ ఉదయం, సాయంకాలాన్ని ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈ బిజీ షెడ్యూల్‌లో ఇది చాలా కష్టమైన పని అనుకుంటున్నారా.. మనసారా అనుకుంటే అన్నీ సులభమే.. మీకున్న కొద్దిపాటి స్థలంలో ఇలాంటి పచ్చటి వాతావరణాన్ని పెంపొందించుకుని.. సమాజహితంలో భాగస్వాములైతే.. అంతకంటే గొప్ప కార్యం ఇంకేముంటుంది.!
ఇదీ చదవండి: Hc Robotics Drones: అత్యాధునిక సాంకేతికతతో డ్రోన్లు రూపొందిస్తున్న హెచ్‌సీ రోబోటిక్స్