ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లు.. గల్లీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని.. వార్డుల్లో ప్రజలే కథానాయకులని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకతతో పాటు, హక్కులు కల్పించడానికే కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డిలోని నారాయణ రెడ్డి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
కాలనీలో కలియతిరుగుతూ.. పాదయాత్ర చేశారు. అనంతరం చర్చ వేదిక ఏర్పాటు చేసి కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాలనీలో చెత్త, రేషన్, మురికి కాలువలు, కరెంట్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు మంత్రికి విన్నవించారు.
పట్టణానికి రూ. కోటి 50లక్షలు మంజూరయ్యాయని.. దశల వారీగా పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి తడి, పొడి చెత్తకు బ్యాగులను పంపిణీ చేసి.. రోజు ఉదయం 9గంటల వరకు సేకరణ పూర్తి చేస్తామన్నారు. అధికారులు, ఛైర్మన్, కౌన్సిలర్లు తప్పు చేసినట్లు రుజువైతే శిక్ష తప్పదని హెచ్చరించారు.