Harishrao Lays Foundation Stone for Sangameshwara Lift Irrigation : సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంగారెడ్డి జిల్లా చిన్నచల్మెడ వద్ద మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 2లక్షల 19వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. 2,653 కోట్ల రూపాయలతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను గోవిందాపూర్ నుంచి 660 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయనున్నారు. కాళేశ్వరం నుంచి 12టీఎంసీల నీటిని ఈ పథకం కోసం ప్రభుత్వం కేటాయించింది.
Harishrao Latest comments : తెలంగాణ రావడం.. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అవడం వల్లే వెనుకబడిన అందోల్, జహీరాబాద్ ప్రాంతాలకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో సాగు కోసం రైతులు ఆకాశం వైపు చూసేవారని.. వర్షాలు వస్తేనే పంటలు పండేవని హరీశ్ అన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి తాగు నీరు వస్తున్నట్లు.. ప్రతి పొలానికి సాగునీరు వస్తుందని మంత్రి అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర పథకాల ద్వారా 4లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు సింగూరు జలాలు స్థానికులకు ఇవ్వకుండా హైదరాబాద్‌కు తరలించాయని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక తాగు, సాగునీటి అవసరాలకు కేటాయించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలు ఉండేవని.. నాణ్యత లేని విద్యుత్ వల్ల మోటర్లు కాలిపోయేవని ఆయన అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా... వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఇవ్వడంతో పాటు.. పండించిన పంట కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆధారించాలని అన్నదాతలకు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కొత్త వైద్య కళాశాలలు తేవడంతో పాటు ఆసుపత్రులను అభివృద్ధి చేశామని.. మౌళిక వసతులు పెంచామని స్పష్టం చేశారు. గతంలో చెల్లించిన దానికంటే ఎక్కువ ధరను చెల్లించిన తర్వాతే భూములు తీసుకుంటామని భూనిర్వాసితులకు హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
'తెలంగాణ మరొకరి చేతుల్లోకి వెళ్తే ఆగమవుతుంది. ఉద్యమనేత చేతుల్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు సింగూరును హైదరాబాద్‌కు కట్టబెట్టారు. సింగూరు జలాల కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడు ప్రశ్నించలేదు. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నాం. ఈ పథకం ద్వార 2.19 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. సంగమేశ్వర వల్ల సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు లబ్ధి.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇవీ చదవండి: