రాష్ట్రంలో పేదలు కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో... ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల(TS double bed room scheme) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు జిల్లాలో లబ్దిదారులకు పక్కాఇళ్లు అందించగా.. మరికొన్ని చోట్ల అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొన్ని జిల్లాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
సంగారెడ్డి జిల్లా జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ సొంతూరు డాకూరులో... రెండు పడక గదుల(TS double bed room scheme) లబ్దిదారుల ఎంపిక విమర్శల పాలవుతోంది. గ్రామంలో పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలో 104 ఇళ్లు నిర్మించగా... అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా.. మొత్తం 500 మంది ఇళ్లు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఆ జాబితా పరిశీలించిన అధికారులు.. 113 మంది అర్హులుగా తేల్చారు. ఇటీవలే డ్రా తీసి 104 మందిని ఎంపికచేశారు. కానీ నిజంగా అర్హులైన చాలామందికి జాబితాలో చోటు దక్కలేదు. పారదర్శకంగా ప్రక్రియ చేపట్టామంటున్న అధికారులు.. ఎక్కడా తుది జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. తమ కంటే అన్ని విధాలా మెరుగైన స్థితిలో ఉన్నవారికీ ఇళ్లు దక్కాయని పేదలు ఆరోపిస్తున్నారు.
డాకూర్‌కి చెందిన దుర్గయ్యకు ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కూతురు నరసమ్మ వితంతువు. చిన్న బిడ్డ వెంకటమ్మ వికలాంగురాలు. వారు రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు . రెండు పడక గదుల ఇంటి కోసం దరఖాస్తు చేస్తే అనర్హులంటూ వారిని తిరస్కరించారు.
మాకు ఇల్లు రాలేదు. ఏది రాలేదు. మా నాయన నేనే పని చేసుడు. బతుకుడు. మాకు వెనుక ముందు ఆసరా ఏం లేదు. మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నారు. మాకు ఇవ్వలేదు. దరఖాస్తు కూడా పెట్టినం. అయినా కూడా ఇల్లు ఇవ్వకుండా మాకు తెల్వదు అంటున్నారు. మేము ఎట్లా బతకాలి? మాకు గుడిసె ఒకటి ఉంది అంతే.
-నరసమ్మ, గ్రామస్థురాలు
ఒకే ఇంట్లో 14 మంది ఉంటున్నామని మొగులయ్యతోపాటు ఆయన సోదరులు దరఖాస్తు ఇచ్చారు. కానీ ఆ కుటుంబంలో ఒక్కరికి ఇల్లు అందలేదు. కనీస విచారణ చేయకుండా అనర్హులుగా ప్రకటించారని వారు ఆరోపిస్తున్నారు.
నేను, మా అన్నదమ్ముల కుటుంబాలు, మా అమ్మ, నాన్న అందరం కలిసి 14 మందిమి ఒకే ఇంట్లో ఉంటున్నాం. డబుల్ బెడ్ రూం ఇల్లు కోసం మేం ఐదుగురుం అప్లికేషన్ పెట్టినం. ఫస్ట్ లిస్ట్‌లో నా పేరు వచ్చింది. మా అన్నలకు రాలేదు. ఆ తర్వాత మళ్లీ అది తీసేశారు. దయచేసి ఎంక్వైరీ చేయండి. అర్హులా? కాదా? అని నిర్ణయించండి. మా స్థితిగతులను తెలుసుకోండి.
-మొగులయ్య, గ్రామస్థుడు
కూలిపోవడానికి సిద్ధంగాఉన్న గుడిసెలో జోగమ్మ కుటుంబం జీవిస్తోంది. గుడిసె కూలకుండా కర్రలు ఆధారంగా పెట్టారు. ఈమె దరఖాస్తును కూడా అధికారులు తిరస్కరించారు. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించలేదని వారు వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పక్కా ఇళ్లు కేటాయించాలని పేదలకు కోరుతున్నారు.
ఇదీ చదవండి: CID officer harassment: 'నేను సీఐడీ ఉన్నతాధికారిని.. నువ్వు నాకు కావాలంతే.!'