పండ్లన్నింటికీ మామిడిని రాజుగా అభివర్ణిస్తారు. మామిడి పండును ఇష్టపడని వారుండరు. వీటి కోసం ఏడాది అంతా ఎదురు చూస్తేవాళ్లూ లేకపోలేదు. అలాంటి ఈ ఫలరాజును సాగు చేసిన రైతుకు, అమ్మిన వ్యాపారికి కనీస లాభాలు వస్తాయి. కానీ ఈసారి భిన్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతోంది. ఇక్కడి మామిడికి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఏటా మహారాష్ట్ర, బిహార్, దిల్లీలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కానీ ఈ ఏడాది లాక్డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా మార్కెట్ పడిపోయింది.
సంగారెడ్డి జిల్లా మామిడి పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మేమే స్వయంగా తోటల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తాం. చిరు వ్యాపారులు సైతం తోటలను కౌలుకు తీసుకుంటారు.
-మామిడి రైతులు
లాక్డౌన్ వల్ల పండ్లు అమ్ముకోలేకపోతున్నాం. తోటలు కౌలుకు తీసుకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లాక్డౌన్ విధించబోమన్న సీఎం కేసీఆర్ ప్రకటనతోనే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తోటలు కౌలుకు తీసుకున్నాం. తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో విక్రయాలు జరగడం లేదు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్కు చెందిన నర్సింహా అనే కౌలు రైతు ఆవేదనతో ఆత్మహత్యయత్నం చేశారు. సీజన్ చివరి దశకు చేరుకున్నా డిమాండ్ లేదు. కాయలు చెట్లకే పరిమితమవుతున్నాయి. కొనే వారు లేక రోజూ టన్నుల కొద్దీ పండ్లు చెత్తకుప్పల పాలవుతున్నాయి. గతేడాది లాగా సడలింపు ఇవ్వాలి.
-కౌలు రైతులు
తమ కష్టాలు, నష్టాలు గుర్తించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిచాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: మానింది మందు... బతికింది ఊరు