బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముంగిలో నిమ్జ్ భూ బాధిత రైతులు జిల్లా పాలనాధికారి హనుమంతరావు వాహనాన్ని అడ్డుకున్నారు. రెండో విడత భూసేకరణ పనులు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో సేకరించిన భూములకు సంబంధించిన చెల్లింపులు, రైతు సమస్యలను పరిష్కరించకుండానే అధికారులు భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు.
మార్కెట్లో భూముల ధరలు 50 లక్షలకు పైగా పలుకుతున్న ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా చెల్లింపులు చేసి భూములు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. కలెక్టర్ వాహనశ్రేణి అడ్డుకోవటం వల్ల కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వస్తే మాట్లాడుకుందామని కలెక్టర్ రైతులకు సూచించారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను పక్కకు తప్పించటం వల్ల కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.