సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయి నేషనల్ క్వాలిటీ సర్టిఫికెట్ గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు దక్కింది. జూన్ 12, 13 తేదీల్లో ఆరోగ్య ప్రమాణాల తనిఖీ సంస్థ సభ్యులు కంగ్టి ఆసుపత్రిని సందర్శించారు. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి 86 శాతం మార్కులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడేళ్ల పాటు నిధులు...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్‌తో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది కేంద్రం. వరుసగా మూడేళ్లు పాటు రూ. మూడు లక్షల నిధులు అందుతాయి. ఫలితంగా రోగులకు మరిన్ని సేవలు అందనున్నాయి.
36 వేల జనాభాకు సేవలు...
26 గ్రామపంచాయతీలు 36 వేల జనాభా కలిగిన మండలంలో ఉన్న ఏకైక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగులకు సేవలు అందించడంలో ప్రత్యేక పేరు సంపాదించింది. ఇక్కడి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఈ ప్రత్యేకతతో ఇక్కడ ఏటా 650 వరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి.