* సంగారెడ్డి జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఓ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో నాటాడు. అవి నాసి రకానికి చెందినవి కావడం వల్ల మొలకెత్తలేదు. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. తన బంధువుల సాయంతో సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఫోరంలో కేసు నడుస్తోంది.
* మునిపల్లి మండలం అల్లాపురం గ్రామానికి చెందిన విఠల్‌రావు హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడే ఉంటున్నారు. గ్రామంలో ఆయనకు 18 గుంటల భూమి ఉంగా.. అందులో కొంతమంది ప్లాట్లుగా విభజించి విక్రయించారు. తన వద్ద ఉన్న రికార్డులు చూసి న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
ఈ రెండే కాదు.. మరెన్నో మోసాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త రూపాల్లో అక్రమాలు బయటకొస్తున్నాయి. వస్తువులు, సేవల ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉన్నా ఎవరికీ పట్టడం లేదు. ప్రశ్నించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయి. అయితే వినియోగదారుడు వెనుకడుగు వేయడమే అక్రమార్కులకు ధైర్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం వినియోగదారులకు అండగా సరికొత్త చట్టాన్ని తాజాగా తీసుకురావడం విశేషం. మోసం చేసిన వారికి జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల ఫోరం కార్యాలయం సంగారెడ్డిలో కొనసాగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాలకు సంబంధించి కేసులు, తదితర కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగుతున్నాయి. ప్రస్తుతం ఫోరం అధ్యక్షురాలిగా కస్తూరి, సభ్యులుగా ఇద్దరు అధికారులు సేవలు అందిస్తున్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా అందించే అవకాశం ఉంది. అందులోనూ తెల్ల కాగితంపై రాసిచ్చినా సరిపోతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన సెలవుల్లో ఫోరం పని చేస్తుంది. అయితే ప్రభుత్వం తాజా చట్టం ప్రకారం వినియోగదారుల ఫోరాన్ని ‘వివాదాల పరిష్కార కమిషన్’గా మార్పు చేశారు. వినియోగదారులు ఫిర్యాదు చేసిన 90 రోజుల్లోపే తీర్పు వెలువరించాలని తాజా చట్టం సూచిస్తోంది.
* సంతృప్తికరమైన తీర్పు రాకపోతే అప్పీల్ చేసుకునే అవకాశమూ ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లవచ్చు. మోసపోయిన వ్యక్తి కనీసం రెండేళ్లలోపు సంబంధిత ఫోరంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లా వినియోగదారుల ఫోరం కార్యాలయం ఫోన్ నెంబరు: 08455- 275586
కొత్త నిబంధనలు..
* జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్లు జారీ చేస్తే ఉత్తర్వులు అమలు చేయని వారికి కనీసం నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.
* మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా. ఇలాంటి తప్పులు పదే పదే చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు..
* ఈ-కామర్స్ వినియోగదారులకు మరింత భద్రత కల్పించేలా చర్యలు.
* రిటర్న్, రీఫండ్, ఎ·క్స్ఛేంజ్, వ్యారంటీ, గ్యారంటీ, డెలివరీ, షిఫ్‌మెంట్ చెల్లింపు విధానాలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, చెల్లింపు విధానాలకు కల్పించిన భద్రత గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన 48 గంటల్లో ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో పాటు నెలరోజుల్లోపు పరిష్కరించాలి.
వెసులుబాటుతో..
గతంలో జిల్లా వినియోగదారుల ఫోరంలో రూ.20 లక్షల వరకు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది. ఆపై ఫిర్యాదు చేయాలనుకుంటే హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం కమిషన్‌కు వెళ్లాల్సిందే. అయితే పలువురు అక్కడి వరకు వెళ్లలేక వెనుకంజ వేసేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం కొత్త చట్టంలో జిల్లాలోని వినియోగదారుల ఫోరం (వివాదాల పరిష్కార కమిషన్)లో రూ.కోటి వరకు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతకుపైగా రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో కమిషన్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ వస్తువులు కొనుగోలు చేసినా ఎక్కడైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త చట్టంలో అవకాశం కల్పించారు.
ధైర్యంగా ముందుకు రావాలి..
కొత్త చట్టం వినియోగదారులకు రక్షణ కవచంగా ఉంది. ఎక్కడైనా కల్తీ వస్తువులు, ఇతరత్రా మోసపోయిన వారుంటే ధైర్యంగా ముందుకు రావాలి. సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో వినియోగదారుల ఫోరం (వివాదాల పరిష్కార కమిషన్)లో ఫిర్యాదులు చేసుకుంటే న్యాయం పొందవచ్చు.
- కస్తూరి, వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల