సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున గోశాలలో దాదాపు 800కు పైగా ఆవులను సంరక్షిస్తున్నారు. గణేశ్ చతుర్థి పురస్కరించుకుని పర్యావరణహిత వినాయక ప్రతిమలు తయారు చేయాలనుకున్నారు గోశాల నిర్వాహకులు. ఆవు పేడలో చెక్క పొడి కలిపి 15 రోజులు ఆరబెట్టి ప్రతిమలకు ప్రకృతి నుంచి తయారు చేసిన రంగులద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు.
గోమయంలో లక్ష్మీదేవి
పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేయాలనుకుని గోమయ ప్రతిమలు తయారు చేస్తున్నామని గోశాల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తెలిపారు. ఈ గణపతుల వల్ల నవరాత్రి ఉత్సవాల అనంతరం చెరువులు కలుషితం కాకుండా ఉంటాయన్నారు. గోమయంలో ఉన్న ఆక్సిజన్ మూలంగా ఎంతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. గోమయంలో లక్ష్మీదేవీ ఉందని శాస్త్రాలు చెబుతున్నాయని, గోమయంతో చేసిన ప్రతిమ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువైనట్లేనని నిర్వాహకులు అంటున్నారు.
ఓ వైపు ఆధ్యాత్మికం...మరోవైపు పర్యావరణహితం
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న చాలా మంది ఇప్పటివరకు మట్టి ప్రతిమలను తీసుకెళ్లారు. ఈ గోమయ ప్రతిమలలో ఉన్న సుగుణాలు తెలుసుకున్న వారు గణేశ్ చతుర్థి రోజునే కాకుండా తమ ఇళ్లలో ఉంచుకునేందుకు కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు ఆధ్యాత్మికత మరో వైపు పర్యావరణ పరిరక్షణ ఈ రెండూ వినియోగదారులను గోమయ ప్రతిమలు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నాయి.
- ఇదీ చూడండి : ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు