Friendship Special Story : తోటి విద్యార్థులకు నమస్తే పెడుతూ.. చేతి ఊపి హాయ్ చెబుతున్న ఈ పిల్లాడి పేరు మధు కుమార్. సంగారెడ్డి జిల్లా కంకోల్ ఇతని సొంతూరు. చాలా చక్కగా నవ్వుతూ కూర్చొని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు కదా. అయితే ఇందులో విశేషమేముందని మీకు అనుమానం రావొచ్చు. వాస్తవానికి ఆ కాళ్లు, చేతులు మధువి కావు. గణేష్ అనే ఒక విద్యార్థి ఇలా మధు కుమార్‌ని ఒడిలో కూర్చో బెట్టుకుని.. అతడికి కాళ్లు, చేతులుగా మారాడు. మధుకు కాళ్లు, చేతులు లేవనే విషయం కొత్తవాళ్లకు తెలియనంత స్థాయిలో వీళ్లు ఇలా మ్యాజిక్ చేశారు.
Friends Help Disabled Boy : మధు ఐదో తరగతిలో ఉండగా విద్యుదాఘాతానికి గురై.. కాళ్లు, చేతులు కోల్పోయాడు. చాలా రోజులపాటు ఆస్పత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నా.. కరోనా ప్రభావం వల్ల బడికి వెళ్లలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బడులు నడుస్తుండటంతో రోజూ పాఠశాలకు వెళ్తున్నాడు. ఇటీవల అశోక్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలను ఆటలు ఆడించారు. అంతా అందులో నిమగ్న మయ్యారు.
అదే సమయంలో మధు కళ్లలో కాసింత బాధను ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే ఉపాధ్యాయుడి సారధ్యంలో పిల్లలు మధుకు కాళ్లు, చేతులుగా మారి.. అతని కళ్లలో వెలుగు నింపారు. పాఠశాలకు వస్తున్నప్పటి నుంచి మధుకు.. అతడి మిత్రులు అండగా ఉంటున్నారు. అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం, బయటకు ఎత్తుకొని తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం... ఇలా అతడి బాధ్యత పూర్తిగా వాళ్లే తీసుకున్నారు. ఇంతటి బాధలోనూ మధు కళ్లు సంతోషంతో మెరవడానికి ఈ స్నేహితులే కారణం.
"నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు విద్యుదాఘాతానికి గురై.. కాళ్లు, చేతులు కోల్పోయాను. చాలా రోజులపాటు ఆస్పత్రిలో మంచానికే పరిమితమయ్యాను. నేను ఎక్కడి వెళ్లాలన్నా నా స్నేహితులు అండగా ఉంటున్నారు. అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం, బయటకు ఎత్తుకొని తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం ఇలా వారందరూ నాకు సహకరిస్తున్నారు." -మధు విద్యార్థి