సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేరువేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై.. నలుగురు దుర్మరణం చెందారు. మునిపల్లి మండలం మక్దుంపల్లిలో పిడుగుపడి మాచగోని కృష్ణ, ప్రశాంత్ అనే తండ్రీకుమారులు మృతి చెందగా.. కంగ్టి మండలం తడ్కల్ వద్ద పిడుగుపాటుకు సురేశ్ అనే పశువుల కాపరి బలయ్యాడు. పుల్కల్ మండలం పోచారంలో చంద్రయ్య అనే మేకల కాపరి పిడుగుపాటుతో ప్రాణాలొదిలాడు.
మాచగోని కృష్ణ కుమారుడు ప్రశాంత్‌తో కలిసి తన పొలంలో పనికి వెళ్లాడు. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటం వల్ల పొలం గట్టున ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలోనే భారీ శబ్ధంతో పిడుగుపడటంతో తండ్రీకుమారులు సహా వెంట ఉన్న కుక్క అక్కడికక్కడే విగతజీవులుగా మారారు.
పిడుగుపాటుకు భర్త, కుమారుడుని కోల్పోయిన భార్య కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. ఘటనా స్థలాన్ని మునిపల్లె ఎస్సై మహేశ్వర్‌రెడ్డి సందర్శించి.. మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.