మేఘం కరిగి చినుకుగా మారితే అన్నదాత మోములో నవ్వులు పూస్తాయి. అందరికీ తినేందుకు కంచంలో మెతుకులు వస్తాయి. ఈపాటికే పచ్చని పంటలతో కళకళలాడాల్సిన మాగాణి వెలవెలబోతోంది. ఏడాది కాలంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. ఆదుకుంటుందనుకున్న మంజీరా అడుగంటిపోయింది. మట్టినే నమ్ముకున్న అన్నదాతలు కుటుంబ పోషణ భారంగా మారి పని వెతుక్కుంటూ వలస పక్షులై ఎగిరిపోతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ మానూర్, నాగలి గిద్ద కల్హేర్, ఆందోల్, పుల్కల్ హత్నూర... మెదక్ జిల్లాలోని టేక్మాల్ కొల్చారం, అల్లాదుర్గం, కౌడిపల్లి మండలాల్లో వందలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. ఎందరికో పని కల్పించే అన్నదాతలు ఒక్క పూట కూలి కోసం ఎగబడుతున్నారంటే నేల తల్లి గుండె తరుక్కుపోతోంది.
దుక్కి దున్నేందుకు కొన్న ట్రాక్టర్లు తుప్పు పట్టిపోతున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకుని అప్పుచేసి కొన్న వాహనాలకు నెల నెలా వడ్డీలు కట్టలేక నానా తిప్పలు పడుతున్నారు రైతులు.
విత్తనాలతో సిద్ధంగా ఉన్నాం
మెతుకు సీమలో వర్షం కురిస్తే విత్తునాటేందుకు అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసేందుకు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు. కాని వానలు రాక వాటిని ఇళ్లలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి.
కాడి వదిలి అడ్డా కూలీగా
గ్రామాల్లో పూట గడవక అన్నదాతలు పట్టణాలకు వలసొచ్చి అడ్డా కూలీలుగా మారుతున్నారు. నిత్యం వందలాది మంది పనివెతుక్కుంటూ వస్తున్నారు. ఆత్మాభిమానం తాకట్టు పెట్టి ఏ పని దొరికినా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నదాతల వెతలకు నేల తల్లి గుండె తరుక్కుపోతున్నట్లుంది. బీటలు వారిన మాగాణి దీనంగా చూస్తోంది.
ఇదీ చూడండి: 'కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి'