Land Problems: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 78లో 197ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 200మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పాసుపుస్తకాలు ఉండటంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు పొందారు. ధరణి వచ్చిన తర్వాత ఈ భూములను వక్ఫ్ భూములుగా నమోదు చేశారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
197 ఎకరాల భూమిని అధికారులు వక్ఫ్ జాబితాలో చేర్చడంతో 200మంది రైతులు హక్కులు కోల్పోయారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలేవీ అందడం లేదు. కొత్త పాసుపుస్తకాలు జారీ చేసి.. హక్కులు పునరుద్ధరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు భూమి అక్కరకు రాకుండా పోయిందని... పిల్లల చదువులు, పెళ్లిలు, అనారోగ్యం వంటి సమస్యలు వస్తే అమ్ముకోలేకపోతున్నామని వాపోయారు.
సైదాపూర్ గ్రామం సర్వే నెంబర్ 78లోని పూర్తి భూమి వక్ఫ్ ఖాతాలో ఉన్నట్లు కొండాపూర్ తహసీల్దార్ రమాదేవి స్పష్టం చేశారు. కలెక్టర్ ద్వారా విషయాన్ని వక్ఫ్ బోర్డుకు పంపి.. వారి నుంచి సమాచారం వచ్చిన తర్వాత హక్కుల గుర్తింపు జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అసలైన హక్కుదారులను గుర్తించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: