Electric Truck Carrier: సరకు రవాణా చేసే భారీ వాహనాల ద్వారా అవుతున్న కాలుష్యాన్ని కొంత మేరకైనా తగ్గించాలనేది ఈ ఐఐటీ ఉద్యోగి లక్ష్యం... అందుకే తన ఆలోచనకు పదును పెట్టాడు. బాహ్య వలయ రహదారులు, ఇతర జాతీయ రహదారుల మీద ఎలక్ట్రిక్ ట్రక్ క్యారియర్లను అందుబాటులోకి తెస్తే.. ప్రయోజనం ఉంటుందని భావించాడు... ఆయన చేసిన డిజైన్‌కి పేటెంట్ కూడా సాధించాడు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు..
మహబూబ్ నగర్ జిల్లా సిరిసినగండ్లకు చెందిన వివేకానంద చారి ఐఐటీ హైదరాబాద్‌లో ఆరేళ్లుగా పని చేస్తున్నారు. డిజైన్ విభాగంలో టెక్నీషియన్‌గా ఉన్న ఆయన.. సరుకు రవాణా వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రక్ క్యారియర్‌ను డిజైన్ చేశారు. బ్యాటరీతో నడిచే ఈ క్యారియర్ వాహనాలను హైదరాబాద్ చుట్టూ వున్న బాహ్య వలయ రహదారి మీద ఉపయోగిస్తే మేలనే కోణంలో దీన్ని రూపొందించారు. బాహ్య వలయ రహదారి మీద రోజూ కనీసం ఇరవై ఐదు వేల సరకు రవాణా వాహనాలు తిరుగుతుంటాయి. ఒక్కోటి కనీసం నలబై కిలోమీటర్లు ఈ రహదారి మీద ప్రయాణిస్తాయి. ఈ లెక్కన రోజు కనీసం రెండున్నర లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. కాలుష్యమూ అదే స్థాయిలో ఉంటుంది. ఈ ట్రక్ క్యారియర్లను వాడితే... ఆ మేరకు కాలుష్యాన్ని తగ్గించడానికి వీలవుతుందని వివేకానంద చారి చెబుతున్నారు.
భారీ వాహనాలను సులభంగా ఎక్కించొచ్చు..
భారీ వాహనాలను సులభంగా ఈ ట్రక్ క్యారియర్ మీదకు ఎక్కించొచ్చు. గమ్యానికి చేరిన తర్వాత అంతే వేగంగా లారీని దించడం సాధ్యపడుతుంది. ఆ సమయంలో డ్రైవర్ క్యాబిన్ పక్కకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఇటీవలే ఈ ఆవిష్కరణకు గాను ఆయన పేటెంట్ దక్కించుకున్నారు. బాహ్య వలయ రహదారి మీద వెళ్లే లారీలను వీటి ద్వారా గమ్య స్థానాలకు చేర్చడం వీలవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించే భారీ వాహనాలను పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌గా మార్చడం సాధ్యం కాదు. రేంజ్ తక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఈ సమస్యకు ట్రక్ క్యారియర్లు చక్కని పరిష్కారం చూపుతాయని వివేకానంద చారి చెబుతున్నారు.
ఇదీ చదవండి: