disabled woman Jubeda inspiring story: సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన జుబేదా.. దివ్యాంగురాలు. సాధారణ వ్యక్తులకే పని దొరగడం కష్టం. అలాంటిది వికలాంగుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాను దివ్యాంగురాలైనా.. జుబేదా తన కుటుంబానికి భారంగా ఉండకూడదని నిర్ణయించుకుంది. అందుకే మిగతా వారిలాగా తన కుటుంబాన్ని పోషించాలనుకుంది. కానీ తన పరిస్థితి చూసి ఎవరూ ఏ పనీ ఇవ్వలేదు. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సొంతంగా టెలిఫోన్ బూత్ పెట్టాలనుకుని వికలాంగుల కోటాలో దాని కోసం అధికారుల చుట్టూ తిరిగింది. ఏడాది పాటు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం దక్కకపోగా.. తన శారీరక లోపం చూసి కొందరు చిన్నచూపు చూసేవారు. ఇలాంటివి జుబేదాను మరింత రాటు దేల్చాయి. తన పరిస్థితే ఇలా ఉంటే.. ధైర్యం లేక ఇళ్లలోనే మగ్గిపోతున్న వారి పరిస్థితి ఎలా అనే ఆలోచన వచ్చింది జుబేదాకు.
Divyang Society in Kandi : అంతే.. ఇక తనకోసమే కాకుండా తనలాంటి వారికి కూడా అండగా నిలవాలని ఫిక్స్ అయింది. అందుకోసం మొదట పేద దివ్యాంగులకు ఇంటి స్థలాల కోసం ప్రయత్నించి విజయం సాధించింది. అనంతరం వారికి ఉపాధి కల్పించడంపై దృష్టి సారించింది. తనతో పాటు మరో 13 మందిని కూడగట్టి.. సంఘంగా ఏర్పాటు చేసింది జుబేదా. తమకు ఉపాధి చూపించాలని అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్‌ను అభ్యర్థించింది. స్పందించిన కలెక్టర్ ఎన్ఐఆర్డీ సహకారంతో వీరకి సౌర పరికరాల తయారీలో శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వం నుంచి భవనం, కొంత మూలధనం సమకూర్చారు. ఈ మాత్రం సాయంతో జుబేదా తమ సత్తా ఏంటో చూపించింది.
దివ్యాంగ్ సోలార్ సొసైటీని ఏర్పాటు చేసి.. దివ్యాంగ్ పేరుతో సోలార్ దీపాల ఉత్పత్తి ప్రారంభించింది. తాను ఉపాధి పొందడంతో పాటు.. మరో ఇరవై మందికి ఉపాధి కల్పించింది. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల మార్కెట్‌లో సోలార్ లైట్లకు డిమాండ్ తగ్గింది. మరో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. తన వద్ద ఉన్న దివ్యాంగులకు కుట్టు మిషన్‌పై శిక్షణ ఇప్పించారు. యూనిఫామ్‌లతో పాటు మహిళలకు సంబంధించిన వివిధ వస్త్రాలు కుట్టడంలో వీరంతా నైపుణ్యం సాధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల యూనిఫామ్‌లు కుడుతున్నారు. మహిళల నైటీలు కూడా కుట్టి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 20 మంది వరకు యూనిట్‌లో పని చేస్తుండగా.. వంద మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆర్డర్లు ఎక్కువ ఉన్న సమయంలో మరింత ఎక్కువ మందికి పని కల్పిస్తున్నారు. ఉపాధి కోసం అనేక అవకాశాలు ఉన్నాయని.. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని జుబేదా అంటున్నారు.
జుబేదా వద్ద శిక్షణ పూర్తి చేసుకుని.. ఉపాధి పొందుతున్న దివ్యాంగులు.. తాము ఎవ్వరికీ తక్కువ కాదన్న ధీమాతో ఉన్నారు. గతంలో ఆత్మన్యూనతకు గురైన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో తమ సొంత కాళ్లపై నిలబడ్డారు. సమాజంలో చిన్న చూపునకు గురయ్యే ట్రాన్స్‌జెండర్లు కూడా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. సోలార్ దీపాల తయారీ, బట్టలు కుట్టడం వంటి పనులతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
వీరందరిలో ఆత్మవిశ్వాసనం నింపి.. ఇతరుల కంటే తామూ ఏం తక్కువ కాదని నిరూపిస్తోంది జుబేదా. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు శారీరక లోపం దానికి అడ్డుకాదని.. పట్టుదల, ఆత్మవిశ్వాసముంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారని చాటిచెబుతోంది. తన కోసం మాత్రమే ఆలోచించుకోకుండా తనలాంటి మరో వంద మంది దివ్యాంగులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.