ఎఫ్ఎం రేడియో, షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్, నిర్మాణం అంటే గ్లామర్ ప్రపంచం. ఆధునిక పోకడలు, అత్యాధునిక సాంకేతికత ముడిపడి ఉన్న ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. కానీ మారుమూల ప్రాంతాలకు చెందిన నిరక్ష్యరాస్య మహిళలు ఈ రంగంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. గ్రామీణ మహిళా సాధికారికత, పర్యావరణ పరిరక్షణ, సాంప్రదాయ పంటల సాగు లక్ష్యంగా దక్కన్ డెవలప్మెంట్ సోసైటీ సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో 1983లో ఏర్పాటైంది. ప్రజల్లో చైతన్యం పెంచడంలో మీడియా పాత్రను గుర్తించిన సంస్థ సొంతంగా రేడియో, చిత్ర నిర్మాణ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.
నిపుణులతో శిక్షణ..
1999 చిత్ర నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేసింది. స్థానికులైతే ఈ అంశాలపై మరింత సమర్థవంతంగా చిత్రాలు నిర్మించడంతో పాటు ప్రేక్షకులకు సులభంగా చేరువవుతారని డీడీఎస్ భావించింది. ఆసక్తి ఉన్న మహిళలకు స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రూపొందించుకోవడం, వీడియో తీయడం, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి అంశాలపై... నిపుణులతో ఏడు నెలల పాటు శిక్షణ ఇప్పించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు వ్యవసాయంలోని పలు అంశాలపై అవగాహన కల్పించేలా వందలాది లఘుచిత్రాలు, డాక్యూమెటరీలు నిర్మించారు.
మొదట శిక్షణ పొందిన వారు తమ తదనంతరం వారికి నేర్పించారు. ఇలా ప్రస్తుతం మూడోతరం నిర్మాణంలో ఉంది. వీరు ఇప్పటి వరకు 30కిపైగా దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల్లో పండించే పంటలు, సాగు విధానాలపై సైతం వీరు లఘు చిత్రాలు రూపొందించారు. అక్కడి మహిళా రైతులకు కూడా వీరు చిత్ర నిర్మాణాలపై తర్ఫీదు ఇచ్చారు.
ఆల్ ఇండియా రేడియో సహకారంతో..
1999లో కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో క్యాసెట్లలో రికార్డు చేసి సమావేశాల్లో మైకుల ద్వారా వినిపించే వారు. 2009లో అనుమతులు రావడంతో మాచనూర్లో రేడియో స్టేషన్ నిర్మించారు. ఎఫ్ఎం నిర్వాహణపై స్థానిక మహిళలకు ఆల్ ఇండియా రేడియో వారితో శిక్షణ ఇప్పించారు. సంఘం రేడియో పేరుతో ఛానల్ ప్రారంభించారు. ప్రతి రోజు రాత్రి 7గంటల నుంచి 9గంటల వరకు దీని ప్రసారాలు అందిస్తున్నారు.
వాణిజ్య ఎఫ్ఎంలకు ఏమాత్రం తీసిపోని ప్రసారాలు అందించడం వీరి ప్రత్యేకత. వ్యవసాయం, గ్రామీణ జీవనం వంటి అంశాలతో పాటు... మన ఊరి పంటలు, మన బాల్యం, దర్వాజలో దవాఖానా, చదువు, మీ ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వంటి కార్యక్రమాలతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ప్రతి నెల సమావేశం నిర్వహించి.. ఆ నెలలో ప్రసారం చేయాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. యువతసైతం తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ ఎఫ్ఎం వినడం విశేషం. ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళ నిర్వాహణ కమ్యూనిటీ ఎఫ్ఎం స్టేషన్‌గా గుర్తింపు పొందింది.
ఈ గ్రామీణ మహిళలు ఫిలిం ఫెస్టివల్ నిర్వహించే స్థాయికి ఎదిగారు. గత నెలలో నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు... ఆఫ్రిక దేశాల నుంచి సైతం చిత్రాలు వచ్చాయి.
ఇదీ చూడండి: పోలీసు శాఖలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా: సుమతి