కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో సీపీఎం నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు. సామాన్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి సరైన వైద్యం అందక మరణించే పరిస్థితి చూస్తున్నామని సీపీఎం నాయకులు వివరించారు. పక్క రాష్ట్రంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చారని పేర్కొన్నారు. మరి తెలంగాణలో ఎందుకు చేర్చట్లేదో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు చూసి సంతోషించామని... కరోనా విజృంభన సమయంలో చేతులు ఎత్తివేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నివారణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.