Three Men and Woman Attacked on Young Man KPHB : సినిమాల్లో మనం చూస్తుంటాం. ఒక వ్యక్తిని వెత్తుక్కుంటూ వచ్చి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని కొట్టడమో లేదా సన్మానాలు చేయడమో లేక ఏదో చెప్పాలని చెప్పి వేధించడమో, ఇలాంటివి చాలా సినిమాల్లో తారసపడుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి అదే పేరుగల మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన గాలి వరప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ధర్మారెడ్డి కాలనీ ఫేస్ వన్ హాస్టల్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఈనెల 17వ తేదీన అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వరప్రసాద్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ కాలనీకి వచ్చి ఆరా తీశారు. ఓ హాస్టల్‌లో వరప్రసాద్ అనే వ్యక్తి ఉండడంతో హాస్టల్ నిర్వాహకులు అతనికి సమాచారం ఇవ్వడంతో అతను తెలుసుకునేందుకు వసతి గృహంలో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అసలు వ్యక్తి ఎవరో అని నిర్ధారించుకోకుండా యువతి, ముగ్గురు వ్యక్తులు ఇష్టానుసారంగా అతనిపై దాడి చేశారు. దాడిలో గాలి వరప్రసాద్ పెదవి లోపల గాయం కావడం, దవడకు గాయాలయ్యాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు : దీంతో స్థానికంగా ఉండే యువకులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకొని యువతి, ముగ్గురు యువకుల వివరాలను సేకరించారు. పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పి అక్కడ నుంచి వెళ్లారు. కానీ వారంతా అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా పరారయ్యారు. గాయాల పాలైన గాలి వరప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరప్రసాద్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన నిందితులు వెతుకుతున్న వరప్రసాద్ రెండో రోడ్డులో ఓ వసతి గృహంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.