Stock Market Today December 20th 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఒక్కరోజే 1.5 శాతం మేర స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దాదాపు అన్ని సెక్టార్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం మొదలైనవి మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1176 పాయింట్లు నష్టపోయి 78,041 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టపోయిన షేర్లు : టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లో సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై అన్నీ భారీగా నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు అన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,224.92 కోట్లు విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 10 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.03గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.96 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 72.18 డాలర్లుగా ఉంది.