సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 7న అనారోగ్య లక్షణాలతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. వైద్యుల సూచన మేరకు 9వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి... నమూనాలు సేకరించి వైద్యం అందిస్తుండగా మహిళ మృతి చెందింది. అదే రోజు రాత్రి జహీరాబాద్ తీసుకొచ్చిన కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు.
బుధవారం రాత్రి వెల్లడించిన కొవిడ్ ఫలితాల్లో మృతిచెందిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటం వల్ల మున్సిపల్ అధికారులు ఈ రోజు కాలనీలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. మహిళ కుటుంబీకులు 23 మంది నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 40మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.