గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అయితే.. వరద నీటితో పాటు.. కాలుష్య జలాలు కూడా వచ్చి చెరువులో కలుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మల్లెం చెరువులోకి కాలుష్య జలాలు వచ్చి చేరుతున్నాయి. కిష్టయ్యపల్లి పరిధిలో ఉన్న మల్లెం చెరువులోకి కలుషిత జలాలు చేరడం వల్ల వేలాది చేపలు చనిపోయాయి.
వర్షం వల్ల ఒకవైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వరద నీటిలో కాలుష్య జలాలు కలిసి చెరువులు కలుషితం అవుతున్నాయంటూ అటు రైతులు, ఇటు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లెం చెరువులో కలుషిత జలాలు కలవడం వల్ల అందులోని చేపలన్ని విగతజీవులై పైకి తేలాయి. ఆ చెరువుపై ఆధారపడి దాదాపు 50 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. చనిపోయిన చేపలకు నష్టపరిహారం చెల్లించాలని, తమను ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!