Consumer Commission: నిర్లక్ష్యంగా వ్యవహరించి అప్పుడే పుట్టిన శిశువు మోచేయి కీలు జారిపోయేందుకు కారణమైన వైద్యుల తీరుపై సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారంగా రూ. 5లక్షలు, కేసు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది.
స్నానానికి తీసుకెళ్లి...
సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ సఫీయుద్దీన్ ఫాహిమ్ గర్భవతి అయిన తన భార్య సయ్యద్ రజియా సుల్తానాను యూసుఫ్‌గూడలోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. 2019 మార్చిలో ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో స్నానం చేయించి తిరిగి పాపను తల్లివద్ద ఉంచి వెళ్లారు. కొంతసేపటి తర్వాత పాప కుడి చేయి కీలు జారిపోయినట్లు గుర్తించిన సుల్తానా... తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. వారు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో ఉచితంగా చికిత్స అందించి పంపుతామని హామీ ఇచ్చారు.
బిల్లు చెల్లిస్తేనే...
Consumer Commission: ఈ క్రమంలో మరో ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడిని పిలిపించి ఎక్స్‌రేలు తీయించగా కీలు తప్పిపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు చికిత్స చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాండేజ్‌ను వేసి డిశ్చార్జి చేశారు. మూడు నెలల తర్వాత మరోసారి ఆసుపత్రికి రావాలని తెలిపారు. పాపను తీసుకొచ్చిన అనంతరం బిల్లు చెల్లిస్తేనే ఎక్స్‌రే, వైద్యం అందిస్తామని తెలపగా... చేసేదేమీ లేక ఆ బిల్లును చెల్లించారు. అయితే సరైన చికిత్స పాపకు అందలేదని పూర్వ స్థితిలోనే కీలు ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రి తీరుపై ఆగ్రహం...
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాపకు శాశ్వత అంగవైకల్యం ఏర్పడిందంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్ బెంచ్-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్.ఎస్.రాజశ్రీతో కూడిన బెంచ్ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.5లక్షల పరిహారం, కేసు ఖర్చులకు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: Bus Ticket Fare: ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే: మంత్రి అజయ్‌కుమార్