Fruits to Eat in Winter Season: చలికాలంలో జలుబు, జ్వరంతో పాటు జీర్ణశక్తి మందగిస్తుంటుంది. ఇంకా శరీరానికి సరిగ్గా ఎండ తగలక విటమిన్ డి లోపం తలెత్తి రోగనిరోధక శక్తీ క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యల్ని నివారించాలంటే ఈ కాలంలో లభించే కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి
చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని నేరుగానైనా లేకపోతే రసం, పచ్చళ్ల రూపంలో కూడా తినవచ్చు. ఉసిరిని తరచూ తీసుకోవడం వల్ల ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని 2020లో "ఫుడ్ ఫంక్షన్" జర్నల్లోని ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జియాన్ షు పాల్గొన్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుందని చెబుతున్నారు. అలాగే మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకూ ఉసిరి బాగా పనిచేస్తుందని వివరించారు.
చెరకు
చలికాలంలో జీవక్రియలు నెమ్మదించడం వల్ల అదనపు కొవ్వులు, విషతుల్యాలు బయటికి వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దీని ప్రభావం కాలేయంపై పడుతుందని వివరించారు. శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించి.. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఇందులో ఉండే ఆల్కలీన్ సమ్మేళనాలు శరీరంలో ఆమ్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు. అలాగే చలిగాలులకు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయని తెలిపారు.
రేగు పండు
చలికాలంలో పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని.. అందుకే రేగు పండ్లు తినేలా వాళ్లను ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుందని వెల్లడించారు. అలాగే మలబద్ధకం సమస్యకు ఇది చెక్ పెడుతుందని అంటున్నారు. పెద్దవాళ్లలోనూ చలికాలంలో కీళ్లు పట్టేయడం వంటి సమస్యలొస్తాయని.. వాటికీ రేగు పండు మంచి విరుగుడుగా పనిచేస్తుందన్నారు. ఇందులో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము ఎముకల బలాన్ని పెంచుతాయని వివరించారు.
చింతపండు
చలికాలంలో ఎదురయ్యే అజీర్తి సమస్యలకు చింతపండు మంచి ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయని వివరించారు. ఫలితంగా ఎముక విరుపులకు చెక్ పెట్టవచ్చని.. భవిష్యత్తులో ఆస్టియోపొరోసిస్ సమస్య రాకుండా కూడా జాగ్రత్తపడచ్చని వెల్లడించారు. ఇక చింతపండులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫినోల్స్ బరువును అదుపులో ఉంచడంలో సహాయ పడతాయని తెలిపారు. పాలీఫినోలిక్ సమ్మేళనాలు పేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా రక్షిస్తాయని పేర్కొన్నారు. ఇక చింతగింజల్ని పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగినా జీర్ణశక్తి మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
నువ్వులు
నువ్వుల్లో ఉండే అత్యవసర కొవ్వులు ఎముకలు, కీళ్లకు బలాన్ని చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ కాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, ఎముక విరుపులకు చెక్ పెట్టవచ్చని వివరించారు. దీన్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకొని తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం అందుతుందని వివరించారు. జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి, శరీరంలో రక్తహీనతను నివారించడానికి నువ్వుల్ని మించింది లేదని నిపుణులు వెల్లడించారు.
ఇవి కూడా!
- ఈ కాలంలో తలెత్తే జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి నెయ్యి కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని మితంగా.. అంటే రోజుకు ఒకట్రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవడం ఉత్తమమని వెల్లడించారు.
- ఈ కాలంలో ఎక్కువగా లభించే చిలగడదుంప/కందగడ్డలు మలబద్ధకాన్ని దూరం చేయడంలో సాయపడతాయని వివరించారు. ఇంకా ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
- ఇంకా ఖర్జూరాలను రోజూ తీసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడవచ్చని వివరించారు.
- పీచు పదార్థం నిండి ఉన్న చిరుధాన్యాల్ని చలికాలంలో రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చని వెల్లడించారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బెల్లీ ఫ్యాట్ పోయి సన్నగా కావాలా? 10-20-30 రూల్ పాటిస్తే కొవ్వు మాయం!
డైలీ బ్రేక్ఫాస్ట్ తినట్లేదా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!