చికెన్ గున్యా వచ్చినా.. బర్డ్ ఫ్లూ వచ్చినా.. స్వైన్‌ఫ్లూ వచ్చినా ముందుగా బదనాం అయ్యేది బ్రాయిలర్ కోడి మాత్రమే. రోగానికి కారణమేదైనా 'కోడి వల్లనే వ్యాపిస్తుంది' అనే ఒక్కమాట చాలు. చికెన్ ధర అమాంతం పడిపోతుంది. తాజాగా కరోనా కూడా చికెన్‌ను చావుదెబ్బ కొట్టింది.
కరోనా వ్యాధి ఎఫెక్ట్‌తో ఇప్పటికే కేజీ చికెన్ ధర యాభై రూపాయలకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే.. వందకు మూడు కోళ్లు కూడా అమ్మారు. అయితే.. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వందలాది కోళ్లను వదిలిపెట్టి వెళ్లారు. అసలే కరోనా వదంతులు వేగంగా ప్రచారం అవుతున్న పరిస్థితులివి. దీనికి తోడు అల్గోల్ గ్రామ పరిసరాల్లో ఎవరో కరోనా సోకిన కోళ్లు వదిలి వెళ్లారన్న సమాచారం సమీప గ్రామాలకు చెందిన కొంతమంది కోళ్లను పట్టుకొని ఇంటికి వెళ్లారు.
సమాచారం అందుకున్న మున్సిపల్ విక్రమసింహా రెడ్డి ఈ విషయంపై ఆరా తీశారు. అల్గోల్ అటవీ ప్రాంతంలో భారీగా బ్రాయిలర్ కోళ్లు కనిపించాయని మున్సిపల్ సిబ్బంది కమిషనర్‌కి సమాచారం అందించారు. వెంటనే వాటిని పట్టుకొని పాతిపెట్టమని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది అడవిలో తిరుగుతున్న కోళ్లను పట్టుకొని తెచ్చి జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టారు. కరోనాతో ఓ వైపు ప్రపంచమంతా వణికిపోతుంటే గ్రామ సమీపంలో బ్రాయిలర్ కోళ్లు తెచ్చి పారేయడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: మళ్లీ కోర్టుకెళ్లిన నిర్భయ దోషి.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు