భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు నేడు విరామం ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో ఉన్న ఆయన.. అక్కడే గణపతి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి మళ్లీ యథావిధిగా యాత్ర కొనసాగనుంది.
ఈ నెల 8న బండి సంజయ్ యాత్ర సంగారెడ్డి(SANGAREDDY)కి చేరుకుంది. స్థానిక పాత బస్టాండ్ నుంచి సుల్తాన్‌పూర్(SULTANPUR) వరకు యాత్ర జరగనుంది. అక్కడ ఆయన.. మంజీరా నదీ జలాల కాలుష్యాన్ని పరిశీలించనున్నారు.
అక్టోబర్ 2న ముగింపు..
సంజయ్ పాదయాత్రలో భాజపా(BJP) శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని మద్దతు పలుకుతున్నారు. డప్పు చప్పుళ్లు, ఆట పాటలతో కార్యకర్తలు ఉత్సాహపరుస్తున్నారు. రోజుకు సగటున 10 నుంచి 15 కిలోమీటర్ల చొప్పున 35 రోజులపాటు బండి సంజయ్ యాత్ర సాగనుంది. అక్టోబర్ 2న.. హుజూరాబాద్ సభతో తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు.
ఇదే ప్రధాన అజెండా..
భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్ర వేదికగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై సమరశంఖం పూరించడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతోంది. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను, కుటుంబ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా.. యాత్ర సాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ యాత్ర విజయవంతానికి రాష్ట్ర నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. పాదయాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతూ.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర విజయవంతానికి 29 కమిటీలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: BANDI SANJAY: 11వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర.. సంగారెడ్డి టు సుల్తాన్‌పూర్