Lands Grabbing Issue in Jinnaram : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎసైన్డ్ భూముల వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇక్కడ దాదాపు 310 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని.. ఇతరుల పేర్లమీదకు బదలాయించారని ఇటీవల ‘ఈనాడు-ఈటీవీ భారత్’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. తాజాగా ఎసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి ధరణి పోర్టల్లోనూ ఉంచారు. పాత పహాణీల్లో పేద లబ్ధిదారుల పేర్లు ఉండగా..ధరణి పోర్టల్లో ఇతరుల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిసైతం ఇతరుల పేర్లమీద పట్టా అయింది. ప్రభుత్వం పటిష్ఠంగా భూముల నిర్వహణ చేపట్టాలని అమల్లోకి తెచ్చిన ఈ పోర్టల్‌ను కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి పక్కదారి పట్టించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఇదిగో ఎసైన్డ్ ఉల్లంఘనలు
- 166/70, 71, 72, 73 సర్వే నంబర్లలో పేదలకు ఇచ్చిన లావూణి భూములు ఇప్పుడు ధరణి పోర్టల్లో పట్టా కింద చూపుతున్నారు.
- జిన్నారం మండలం కిష్టాయిపల్లి సర్వే నంబరు 166/5/ఉ లో 3.20 ఎకరాల భూమి డప్పు లక్ష్మయ్యకు (తండ్రి బాలయ్య) ప్రభుత్వం ఎసైన్డ్ చేయగా ధరణిలో వేరేవారి పేర్లు ఉన్నాయి.
- 166/10అ నంబరులోని 2.23 ఎకరాల భూమి బాశెట్టిగారి పెద్దరాములుకు (పాత పహాణీ) ఇవ్వగా ఇప్పుడు ఉప సర్వే సంఖ్యను చేర్చి ఇతరుల పేరును ధరణిలో ఎక్కించారు.
- 166/3, 4, 5 ఉపసంఖ్యల్లో భూమిని పేదలకు పంపిణీ చేయగా తాజాగా ధరణిలో సత్యనారాయణ అనే వ్యక్తి పేరుపై చూపుతున్నాయి.
- 166/8/ఈ2, 3 సర్వే నంబర్లలో 0.18 గుంటల చొప్పున చింతకాయల సత్తయ్య, కృష్ణలకు ప్రభుత్వం ఎసైన్డ్ చేయగా ధరణిలో మరొకరి పేరుపైకి ఈ భూములు నిక్షిప్తం చేశారు.
- 166/3ఆ2 పి.నర్సింహులుకు 0.38 గుంటలు, 3ఆ3 శివయ్యకు 1.35 ఎకరాలు, 3ఇ లక్ష్మయ్యకు 3.31 ఎకరాల ఎసైన్డ్ భూమి ఇప్పుడు పోర్టల్లో ఇతరుల పేర్లపైన ఉంది.
ఎసైన్డ్‌ను ఏమార్చి.. దస్త్రాలు మార్చారు
Jinnaram Lands Grabbing Issue : రాష్ట్రంలో ఏ సర్వే నంబరులో ఏ యజమాని ఉన్నారు, తదనంతర కాలంలో ఆ భూమి ఎవరి పేరుపైకి మారిందనేది పహాణీ చెబుతుంది. 1954లో రాష్ట్రంలో తొలిసారి ఖాస్రాపహాణీ రూపొందించారు. ఇప్పటి వరకు భూమి, దాని యజమానుల చరిత్రను తెలియజెప్పే దస్త్రం ఇదే. జిన్నారం మండలంలో ఎసైన్డ్ భూములు పొందిన రైతుల పేర్లు పాత పహాణీల్లో ఉన్నాయి. 2012 నుంచి ఒక్కో సంవత్సరం కొత్తవారి పేర్లను తెలివిగా పహాణీల్లో చేర్చారు. 2017-2018లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం పోర్టల్లోకి (టీఎస్‌ఐఎల్‌ఆఎర్‌ఎంఎస్) ఎసైన్డ్ లబ్ధిదారుల స్థానంలో ఇతర ప్రాంతాల వారి పేర్లను నిక్షిప్తం చేశారు. లావూణీ పట్టాలు కాస్తా ప్రైవేటు పట్టాలుగా మార్చేశారు.
నిబంధనలకు విరుద్ధమని తెలిసినా..
ఎసైన్డ్ భూముల చట్టం చాలా కఠినంగా ఉంటుంది. చట్టం ప్రకారం లబ్ధిదారుకు కూడా వాటిని విక్రయించడానికి అనుమతి లేదు. బహుమతి, దానం లాంటివి కూడా చెల్లవు. వారసత్వ బదిలీకి మాత్రమే అవకాశం ఉంది. చట్ట ఉల్లంఘన చోటుచేసుకుంటే భూములను ప్రభుత్వం వెనక్కుతీసుకోవచ్చు. ఇంత పదునైన చట్టాన్ని కూడా సంగారెడ్డి జిల్లాల్లో పక్కదారి పట్టించడం గమనార్హం.