అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 'షీ ఫర్ హర్' కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, విద్యార్థులు మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని స్మితా సబర్వాల్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. పోలీసులు ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి మహిళలకు భరోసాగా ఉంటున్నారని వెల్లడించారు. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రతకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అమ్మాయిలు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు 100 నంబర్‌కు డయల్ చేయాలని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. విద్యార్థులు తమకు మాత్రమే ఆపద వచ్చినప్పుడు స్పందించడం కాకుండా... వాలంటరీగా ఇతర మహిళలు, విద్యార్థులకు సాయం చేయాలని అన్నారు.
ఇవీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: మంత్రులు