Bank Of Baroda Cashier Case: బ్యాంకు ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రవీణ్‌ను వనస్థలిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హయత్‌నగర్ కోర్టు 3రోజుల కస్టడీలోకి అనుమతించడంతో.. చర్లపల్లి జైలు నుంచి ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రవీణ్‌ను వనస్థలిపురం పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 21వ తేదీతో కస్టడీ ముగియనుంది. 22వ తేదీ ఉదయం 10.30గంటలకు ప్రవీణ్‌ను తిరిగి హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
అసలేం జరిగిందంటే..: వనస్థలిపురంలోని బ్యాంకు ఆప్ బరోడాలో రూ.22 లక్షలను క్యాషియర్ ప్రవీణ్ మాయం చేసినట్లు, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన బ్యాంకు నుంచి వెళ్లిపోయిన ప్రవీణ్... ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడు. పోలీసులు బృందాలు ఏర్పడి గాలించారు. తాను క్రికెట్ బెట్టింగులో డబ్బులు పోగొట్టుకున్నట్లు ప్రవీణ్ బ్యాంకు సిబ్బందితో పాటు తల్లికి సందేశం పంపించాడు. ప్రవీణ్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాను ఏ తప్పు చేయలేదని... బ్యాంకు నగదు లావాదేవీల్లో తేడాలు వస్తున్నట్లు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపించాడు. మేనేజర్ నిర్లక్ష్యం వల్లే నగదు తక్కువగా వస్తోందని ప్రవీణ్ ఆరోపించాడు. ఈనెల 16వ తేదీన కోర్టులో లొంగిపోయిన ప్రవీణ్.. బ్యాంకులో చాలా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఎన్ఆర్ఐ ఖాతాలోనూ మోసం జరుగుతోందని, త్వరలో ఆ వివరాలు బయటపెడతానని అన్నాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ప్రవీణ్‌ను... బ్యాంకులో నగదు లావాదేవీల్లో తేడాలపై పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. మేనేజర్, సిబ్బందిపై చేసిన ఆరోపణలు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: