Cars Accident In Rangareddy: నిత్యం చిన్నపిల్లలు ఆడుకుంటూ.. కుర్రవాళ్లు, పెద్దలు అటూఇటూ కాలనీ వాసులతో రద్దీగా ఉండే వీధి అది. ప్రతిరోజూ కాలనీలో ఉదయం, సాయంత్రం అయితే చాలు సరదాగా రోడ్డు మీదే గడుపుతూ ఉంటారు. అయితే అన్నిరోజులాగా ఈరోజు ఉంటే మాత్రం.. ఈ పాటికి ఎందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయిండేయో.. ఈ విషయంలో కాలనీ వాసులు అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకంటే కారు సృష్టించిన బీభత్సం అలాంటిది మరీ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో చోటుచేసుకుంది. ఈ విధ్వంసంలో రెండు కార్లు, 15బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
A Fire Spread In A Car In Rangareddy: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం నుంచి రాజశేఖర్ అనే యువకుడు అతివేగంగా కారును నడుపుకుంటూ వస్తున్నాడు. జర్నలిస్ట్ కాలనీ నుంచి షార్ట్‌కట్‌లో చేవెళ్లకు బయలుదేరాడు. అక్కడకు రాగానే అతివేగంగా వెళుతున్న కారు.. అదుపు తప్పి రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన రెండు కార్లను, 15 బైక్‌లను పూర్తిగా ధ్వంసం చేసిందని స్థానికులు తెలిపారు. ఎవరూ బయటలేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయ్యిందని పేర్కొన్నారు.
స్థానికులు ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరిగెత్తుకుని వచ్చారు. మధ్యాహ్నం సమయం కావడంతో ఎవరూ రోడ్ల మీద లేరని.. ఒకవేళ ఇదే ప్రమాదం ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. జేసీబీ సహాయంతో అక్కడే ధ్వంసమై ఉన్న వాహనాలను పక్కకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవింగ్ చేసిన రాజశేఖర్‌ను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రయాణిస్తున్న కారులో మంటలు: మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సోలిపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, జడ్చర్ల టోల్ ప్లాజా అధికారులు పరిస్థితిని దగ్గరుండి చక్కదిద్దారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ కాళీ మందిర్ నుంచి మహబూబ్‌నగర్‌కు బయలుదేరాడు. షాద్‌నగర్‌లోని సోలిపూర్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి వంతెన సమీపం వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కారులోనుంచి బయటకు వచ్చేశారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: