రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహన ఘటనకు కారణాలను ఇప్పటికీ ప్రభుత్వం వెల్లడించలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల సవరణలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లు గడిచినా... నేటికీ 11లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో తాను రాజకీయం మాట్లాడట్లేదన్న ఆయన... ఓ వృద్ధ దంపతులు రెవెన్యూ ఉద్యోగులకు లంచం ఇచ్చేందుకు భిక్షాటన చేయడం దురదృష్టకరమన్నారు.
ఆ రైతుకు అన్యాయం జరిగినందుకే అలా...
చిగురుమామిడిలో కనకయ్య అనే రైతు... నిజమైన రైతు... ఆయనకు పాస్ పుస్తకం ఇవ్వడానికి లంచం తీసుకుని కూడా ఇవ్వలేదన్నారు. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడన్న కారణంతో ఆయనను జైలుకు పంపారని మండిపడ్డారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు కానీ... రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. లక్షల మంది రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.