tree transplantation: రాష్ట్రంలో హరితహారం పథకంలో భాగంగా ప్రజలు కోట్లకొద్ది మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ పేరిట సెలబ్రెటీలు కూడా మొక్కలు నాటుతూ.. పర్యవరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు. మొక్కలు నాటటం.. వాటిని సంరక్షించటం వరకు చాలా బాగుంది. కానీ.. అభివృద్ధి పేరిట.. విస్తరణ పేరిట.. అడ్డొచ్చిన వృక్షాలను మాత్రం అడ్డంగా నరికేస్తున్నారు. ఏళ్ల నుంచి ఏపుగా పెరిగి ఎంతో మందికి నీడనిచ్చి.. ప్రాణవాయువునిస్తున్న వృక్షాలను నిర్వీర్యం చేయకుండా.. కొందరు పర్యావరణ ప్రేమికులు పాటుపడుతున్నారు. నరికివేయటమే పరిష్కారం కాదు.. స్థానభ్రంశం చేసి తిరిగి ప్రాణం పోయోచ్చని నిరూపిస్తున్నారు.
నిర్వీర్యం చేయటం ఇష్టం లేక..
tree translocation in shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు 'వై' జంక్షన్ నుంచి ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామ శివారులోని బెంగళూరు జాతీయ రహదారి బైపాస్ వరకు ఉన్న పాత జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గత ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 67 కోట్లతో 17 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు.. పనులను ప్రారంభించారు. ఈ రహదారి గుండా.. 850 వివిధ రకాల వృక్షాలు ఉన్నాయి. పనుల్లో భాగంగా వాటిని తొలగించాల్సిన పరిస్థితి. చూస్తూ చూస్తూ.. వాటిని నిర్వీర్యం చేయటం ఇష్టం లేక.. ప్రత్యామ్నాయంపై అధికారులు దృష్టి పెట్టారు. వాటిని సురక్షితంగా తీసుకెళ్లి ఇంకో చోట ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చని తెలుసుకున్నారు.
అభినందిస్తోన్న స్థానికులు..
ఇందుకోసం ఔత్సాహికంగా ఉన్న పర్యావరణ ప్రేమికులకు సమాచారం ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేసేందుకు.. యూనిక్ ట్రీ నర్సరీ యజమాని రాందేవ్ రావు చెట్లను తన నర్సరీకి తరలించేందుకు ముందుకొచ్చాడు. గ్రీన్ ఫార్మర్ ఇండియా సహకారంతో ఈ రహదారి వెంబడి ఉన్న దాదాపు 40 వృక్షాలను తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూక్నగర్ మండలంలోని గ్రామాలలో ఉన్న వృక్షాలను యంత్రాల సాయంతో తీసి పెద్దలారీల సహకారంతో సురక్షితంగా నర్సరీకి తరలిస్తున్నారు. అడ్డొచ్చిన పెద్దపెద్దచెట్లను అడ్డంగా నరికేసుకుంటూ వెళ్లకుండా.. వాటిని రక్షించడానికి చర్యలు తీసుకుంటున్న పర్యావరణ ప్రేమికులు, అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు.
సంరక్షణ బాధ్యత తీసుకున్నాం
"ఏపుగా పెరిగిన వృక్షాలను ఇక్కడి నుంచి చేవెళ్ల- శంకర్పల్లి రోడ్డులో గల యూనిక్ ట్రీ నర్సరీకి తరలిస్తున్నాం. ఈ వృక్షాలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. ఒక్కో వృక్షాన్ని తరలించడానికి దాదాపు రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ తీసిన వృక్షాలను మరో ప్రదేశంలో నాటితే.. దాదాపు రెండు నెలల కాలం తర్వాత అది మళ్లీ చిగురిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకొని వృక్షాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం." - నాగిరెడ్డి దుర్గాప్రసాద్, గ్రీన్ ఫార్మర్ నిర్వాహకుడు
ఇదీ చూడండి:
- ఎన్‌హెచ్- 161 విస్తరణ పనుల సందర్భంగా భారీ వృక్షాలను కొట్టేశారు. వాటిని అలా పడేయకుండా వేరే ప్రాంతంలో నాటించడంలో(forest plants and trees) అటవీశాఖ ప్రత్యేక చొరవ చూపింది. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో నాటించి... వాటిని సంరక్షిస్తూ వచ్చింది. కాగా ఈ పద్ధతిలో అటవీ శాఖ సక్సెస్ అయింది. ఆ భారీ వృక్షాలు మళ్లీ చిగురించాయి. పూర్తి కథనం కోసం.. forest plants and trees: ట్రాన్స్‌లొకేషన్.. చిగురించిన భారీ వృక్షాలు.. అటవీ శాఖ సక్సెస్