రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ గ్రీన్ కాలనీకి చెందిన దంపతులు ఇటీవల మంగళ్‌హాట్‌లోని సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. కొద్దిరోజులకు తీవ్ర జ్వరం రావడం వల్ల శుక్రవారం వారు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్ ఉన్నట్లు శనివారం సాయంత్రానికి తేలింది.
వెంటనే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఇటు జీహెచ్‌ఎంసీ స్థానిక అధికారులకు దంపతులు విషయాన్ని చెప్పారు. 108 వాహనానికీ సమాచారమిచ్చారు. ఆదివారం రాత్రి వరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. సోమవారం ఉదయం బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి విషయం వెళ్లడం వల్ల ఆయన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. దీనితో రంగారెడ్డి జిల్లా అధికారులు మధ్నాహ్నం ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తక్షణం స్పందిస్తేనే..
నగరంలో నిమ్స్, ఫీవర్ ఆసుపత్రి, కింగ్‌కోఠి, ఛాతి ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనా నిర్థారణకు స్వాబ్ నమూనాలు తీసుకుంటున్నారు. ఎవరికైనా పాజిటివ్ తేలితే సంబంధిత విభాగాలు 108 వాహనాన్ని పంపించి గాంధీ లేదా ఇతర కొవిడ్ ఆసుపత్రులకు పంపించాలి. కొద్ది రోజులుగా కొవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించే విషయంలో కిందిస్థాయి సిబ్బంది సరైన రీతిలో స్పందించడం లేదని.. కొన్నిసార్లు 108 వాహనాలు కొన్ని గంటలపాటు రావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు