Harish Rao on Telangana Diagnostics : తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా మరో 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ కొండాపుర్ జిల్లా ఆసుపత్రి వేదికగా మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా వైద్య పరీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండాపుర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవ జాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని హరీశ్ రావు ప్రారంభించారు.
Telangana Diagnostics Free Medical Tests : ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు 8 డయాగ్నోస్టిక్ సెంటర్‌లు, 16 రేడియాలజీ కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇప్పటి వరకు 54 పరీక్షలు చేస్తుంటే.. ఇక నుంచి మరో 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగులు, వైద్యుల ఫోన్‌లకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కాన్, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Another 134 Tests in Telangana Diagnostics : కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు చాలా కష్టపడ్డారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా మారాయని మంత్రి వెల్లడించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పేద ప్రజలను ప్రభుత్వ హాస్పిటల్స్‌కు తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌లు అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానాల్లో 30 శాతం డెలివరీలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం అవుతున్నాయన్నారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే రోబోటిక్ శస్త్రచికిత్సలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
'తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇప్పటి వరకు 54 పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. మరో 134 వైద్య పరీక్షలను నేడు అందుబాటులోకి తీసుకొచ్చాం. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చాలా కష్టపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్ కిట్, గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్ అందిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం అవుతున్నాయి. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం.’ - మంత్రి హరీశ్‌రావు
ఇవీ చూడండి..
CM KCR Speech at NIMS : 'సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాల లక్ష్యం అదే'
Harish Rao: 'దిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో మాత్రం విమర్శిస్తారు'