Statue Of Equality News: శ్రీరామానుజాచార్యుల వెయ్యేళ్ల వైభవాన్ని పురస్కరించుకొని..హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఫిబ్రవరి 2న మొదలైన సమతా మూర్తి వేడుకలు.. 11 రోజులుగా ఎంతో కన్నుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ.. సహస్ర కుండలాల యజ్ఞం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 12 రోజుల పాటు లక్ష్మీనారాయణ మహాయాగం నిర్విఘ్నంగా సాగింది. ఈ యాగంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Sri Ramanujan Millennium Celebrations: అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి చినజీయర్ స్వామి ప్రాణ ప్రతిష్ఠాపన చేసి తొలి పూజ నిర్వహించారు. 5 వేల మంది ఋత్వికులు, 9 మంది జీయర్ స్వాములు స్వర్ణమూర్తికి అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 ఆలయాల్లో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముచ్చింతల్ శ్రీరామ నగరానికి వేలాదిగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహస్రాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొని 108 ఆలయాల్లో శాంతి కల్యాణాన్ని వీక్షించనున్నారు.