రాష్ట్రంలో కూలీల కొరత దృష్ట్యా వరి సాగులో యాంత్రీకరణ చేపట్టాల్సి ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవన్‌లో ప్రాణాధార ఫౌండేషన్ కన్వీనర్ కె.పుండరీకాక్షుడు నేతృత్వంలో ప్రతినిధులు... వీసీతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ఉన్నతాధికారులు, వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వరిలో నేరుగా విత్తడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రాణాధార ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న డైరెక్ట్ సీడింగ్ విధానం, ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించారు.
సాధారణంగా ప్రతి సీజన్‌లో వరి నాట్ల నుంచి కోత వరకు అనేక పనుల్లో యాంత్రీకరణ చేపట్టాల్సి ఉందని... కూలీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని ప్రవీణ్‌రావు చెప్పారు. వరిలో డైరెక్ట్ సీడింగ్ వల్ల సాగు ఖర్చులు సుమారు రూ.10 వేలు తగ్గించవచ్చని ఉపకులపతికి శాస్త్రవేత్తలు వివరించారు. తెలంగాణ ప్రాంత భూములు, పరిస్థితులకు అనుగుణంగా నేరుగా విత్తడం, వెదజల్లడం పద్ధతులు ఏ మేరకు ఉపయోగపడుతాయన్న అంశాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాణాధార ఫౌండేషన్ ప్రతినిధులు చర్చించి ఓ కార్యాచరణ రూపొందించాలని వీసీ సూచించారు.
ఇదీ చదవండి: 'మాలే' దీవికి గో ఎయిర్ విమానం సిద్ధం.. ప్రయాణమే ఆలస్యం.!