మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 34 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని పాత గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని 25 చెరువులు పూర్తిగా జలకళను సంతరించుకోగా... మరో 75కుపైగా చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ అమయ్ కుమార్... క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశారు.
వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలెవరైనా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040-23230813, 23230817 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగులో వరద ప్రవాహం జోరందుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు చేరి... ఈసీ వాగు పొంగి ప్రవహిస్తోంది. కొన్నేళ్లుగా సరైన వర్షాపాతం లేక అల్లాడిపోతున్న చేవెళ్ల రైతులకు ఈ వర్షాలు ఊరట కల్పించాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు వికారాబాద్ జిల్లాలోనూ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
నాలుగేళ్లుగా నిండని ప్రాజెక్టులు కూడా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. మోమిన్‌పేట మండలంలోని నందివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. అలాగే వికారాబాద్ మండలంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టానికి చేరుకుంది. యాలాల మండలం జుంటుపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. అటు చెరువుల, ప్రాజెక్టులు నిండుతుండటం వల్ల నాగసముందర్ రహదారిపై ఉన్న వంతెనతోపాటు మంబాపూర్ వంతెనలు కూలిపోయాయి. ఆ మార్గంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీంతో తాండూరు నుండి కొడంగల్, పరిగి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను దారి మళ్లించారు.