National Conference on Entomology-2022: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంటమాలజీ-2022 పేరిట జాతీయ సదస్సు జరిగింది. ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ ధావన్ సదస్సును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికిపైగా శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కీటకాల ఉద్ధృతి, వ్యవసాయ, ఉద్యాన పంటలపై చూపుతున్న తీవ్ర ప్రభావం, రైతులకు సంభవిస్తున్న నష్టాలు, సేద్యంలో పెరుగుతున్న పెట్టుబడుల వ్యయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రసాయన, పురుగు మందుల అవశేషాల్లేని ఆహారోత్పత్తులు పెద్ద సవాల్‌గా మారింది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ రంగాల్లో కీటకాల ఉధృతి తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. కూరగాయ పంటల్లో వ్యాపించే ఒక్క తెల్లదోమలో 46 జాతులు ఉంటే... భారత్‌లోనే 12 జాతులున్నట్లు తేలిందని కీటక శాస్త్ర పరిశోధకులు తెలిపారు. కీటకాల్లో దోమ, పేను, నల్లి, ఈగలు, దోమలు కొన్ని వ్యాధుల్ని కలుగజేస్తాయి. చెదపురుగులు నిర్మాణాలను, మిడతలు మొదలైనవి పంటలను పాడుచేస్తాయి.
'కొన్ని కీటకాలు పర్యావరణం, మానవులకు ఉపయోగకరమైనవి. కందిరీగ, తేనెటీగ, సీతాకోక చిలుక, చీమలు మొదలైనవి మొక్కల వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇటీవల మిడతల దండు దాడి, పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు వ్యాపించిన దృష్ట్యా వాటిని అరికట్టేందుకు పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం' అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం అన్ని విభాగాల శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. పరిశోధన ఫలితాలు రైతుకు చేరినపుడే ఆహారభద్రతకు ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: